MH Elections 2024: మహారాష్ట్రలో 110 సీట్లపై కన్నేసిన కాంగ్రెస్-ఆ రెండు పార్టీలకూ 100 లోపే..!
మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెలలో ఒకే విడతలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలో సీట్ల పంపకాలు త్వరలో కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే గతంలో కూటమిలో మిత్రపక్షాలైన శివసేన, ఎన్సీపీ బలంగా ఉండేవి. కానీ వాటిలో చీలికలతో అవి బలహీనం అయ్యాయని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లలో తానే పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. 288 సీట్ల మహారాష్ట్ర అసెంబ్లీలో 100 సీట్లకు పైగా తామే పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.
మహా వికాస్ అఘాడీ కూటమిలో సీట్ల పంపకాలపై దాదాపు క్లారిటీ వచ్చినా ఇంకా 20-30 సీట్లపై మాత్రం తకరారు కొనసాగుతోంది. దీంతో కూటమి పార్టీలు ఇంకా సీట్ల చర్చల్లో ఉన్నాయి. అయితే ఓవరాల్ గా మాత్రం 110 సీట్ల వరకూ తామే పోటీ చేయాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. శివసేన యూబీటీ, ఎన్సీపీ శరద్ పవార్ వర్గాలకు 100 లోపే సీట్లు ఇచ్చేలా కాంగ్రెస్ ఒప్పించే ప్రయత్నాలు చేస్తోంది. అయితే వారు కూడా లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చిన జోష్ తో దీనికి అంగీకరించడం లేదు.

ఈ నేపథ్యంలో శివసేన ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ మాత్రం క్లారిటీ ఇచ్చేసారు. కూటమిలోని మూడు పార్టీలకు కూడా 100 లోపే సీట్లు దక్కే అవకాశం ఉందని వెల్లడించారు. సమాజ్ వాదీ పార్టీ, లెఫ్ట్ పార్టీలు, పీడబ్ల్యూపీ వంటి పార్టీలు కూడా కూటమిలో భాగస్వాములు అవుతున్న నేపథ్యంలో ఏ ఒక్క పార్టీకి కూడా గంపగుత్తగా 100 సీట్లకు పైగా ఇచ్చే అవకాశాలు లేవని ఆయన చెప్పేస్తున్నారు. కానీ లోక్ సభ ఎన్నికల్లో ప్రదర్శన ఆధారంగా తమకు మాత్రం 110 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది.












Click it and Unblock the Notifications