షాకింగ్: టైర్ షాప్ ఓనర్‌కి రూ.77 కోట్ల కరెంట్ బిల్లు
హర్యానా: ఓ మధ్య తరగతి వ్యక్తికి దిమ్మ తిరిగే కరెంట్ బిల్లు వచ్చింది. ఈ సంఘటన హర్యానాలోని ఫరీదాబాదులో జరిగింది. తనకు రూ.77 కోట్ల కరెంట్ బిల్లు రావడంతో సదరు మధ్య తరగతి వ్యక్తి కంగుతిన్నాడు. అతను టైర్లు రిపేర్ చేసే చిన్న దుకాణం నడుపుతున్నాడు.
అతనికి అక్షరాలు రూ.77.89 కోట్ల బిల్లు వచ్చింది. బిల్లు చూసి షాకయ్యాడు. సురీందర్ ఆటో వర్క్స్ అనే చిన్న దుకాణానికి వచ్చిన కరెంటు బిల్లు చూసి దాని యజమాని, ఆయన కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. అందులో ఒక ఫ్యాను, ఒక లైటు మాత్రమే ఉంది.
ప్రతి నెల రూ.2వేల నుంచి రూ.2,500 వరకు మాత్రమే బిల్లు వస్తుంది. ఇప్పటి వరకు విద్యుత్తు బకాయిలు కూడా ఏమీ లేవని యజమాని చెప్పారు. పెద్ద మొత్తంలో కరెంటు బిల్లు చూసి షాపు యజమాని తల్లి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.

అక్టోబరు 31వ తేదీన వచ్చిన ఈ బిల్లు దక్షిణ హర్యానా బిజిలి వితరన్ లిమిటెడ్ నుంచి వచ్చింది. భారీ మొత్తంలో కరెంటు బిల్లులు రావడం హర్యానాలో గతంలోను జరిగాయి. కాగా, ఇందుకు కారణమైన ఇద్దరు క్లర్క్‌లను సస్పెండ్ చేశారు.
స్థానికులు మాట్లాడుతూ... అంత పెద్ద మొత్తంలో కరెంట్ బిల్లు రావడంతో అది తెలుసుకున్న దుకాణ యజమాని తల్లి అస్వస్థతకు గురయ్యారని, ఆమెను ఆసుపత్రికి తరలించారని చెప్పారు.
కాగా, గతంలో గోహనా పట్టణంలోని ఓ పాన్ దుకాణ యజమానికి రూ.132 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. ఇది గత ఏడాది అక్టోబర్ నెలలో జరిగింది. అంతకుముందు 2007లో నార్నాల్ పట్టణంలో ఓ ఇంటికి రూ.234 కోట్ల బిల్లు వచ్చింది.












Click it and Unblock the Notifications