మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి అవమానం: ఫోటోలకు తారు, మసిపూశారు, బీజేపీ!
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాజీ ప్రధాని ఇందిరా క్యాంటీన్ వ్యవహారంలో కొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఫోటోలకు తారు (మసి) పూసి ఇందిరా క్యాంటీన్ ఇక్కడ నిర్వహించరాదని గోడల మీద నినాదాలు రాశారు.

మాజీ ప్రధాని ఫోటోలు
మంగళూరు సమీపంలోని సురత్కల్ లో ఇందిరా క్యాంటీన్ పనులు దాదాపు పూర్తి అయ్యాయి. రెండు వారాల్లో ఇందిరా క్యాంటిన్ ప్రారంభించడానికి పనులు చకచకా జరుగుతున్నాయి. ఇందిరా క్యాంటీన్ కట్టడం మీద పెద్దపెద్ద అద్దాలు ఏర్పాటు చేసి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఫోటోలు ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్యే భేటీ
శుక్రవారం స్థానిక శాసన సభ్యుడు మోయిద్దీన్ బాబా ఇందిరా క్యాంటిన్ పనులు పరిశీలించి వెళ్లారు. శుక్రవారం అర్దరాత్రి దాటిన తరువాత గుర్తు తెలియని వ్యక్తులు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఫోటోలు మీద తారు, మసి పూసి ఇక్కడ ఇందిరా క్యాంటిన్ నిర్వహించరాదని గోడల మీద నినాదాలు రాశారు.

కాంగ్రెస్ కార్యకర్తలు
శనివారం పనులు చెయ్యడానికి వెళ్లిన సిబ్బంది విషయం గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇందిరా క్యాంటిన్ దగ్గర గుమికూడటంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.

బీజేపీ కార్యకర్తలు
మంగళూరు పరిసర ప్రాంతాల్లో గొడవలు సృష్టించడానికి కావాలనే ఇలా చేశారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలు ఇలా చేసి ఉంటారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. సూరత్కల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications