జనాలపైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు: లఖింపూర్ ఖేరి ఘటన రిపీట్; ఆపై ఏం జరిగిందంటే
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖేరి ఘటన తరువాత మళ్లీ అటువంటి ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో చిలికాకు చెందిన బిజెడి ఎమ్మెల్యే ప్రశాంత్ జగ్‌దేవ్ తన కారుతో ఒక్కసారిగా జనాల పైకి దూసుకు పోయారు. ఈ ఘటనలో ఏడుగురు పోలీసు సిబ్బంది సహా కనీసం 22 మంది గాయపడ్డారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఒక్కరు ప్రాణాలు కోల్పోయారని సమాచారం.

జనాలపైకి దూసుకుపోయిన ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్ కారు
ప్రాథమిక సమాచారం ప్రకారం, సంఘటన జరిగినప్పుడు బ్లాక్ చైర్‌పర్సన్ ఎన్నిక కోసం బిజెపి మద్దతుదారులతో సహా పెద్ద సంఖ్యలో ప్రజలు బాణాపూర్ బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీస్ (బిడిఓ) వెలుపల గుమిగూడారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన బీజేడీ ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్ కారు ఒక్కసారిగా జనాల పైకి దూసుకు వెళ్ళింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 22 మంది గాయపడినట్లు గా సమాచారం.
ఎమ్మెల్యే కారుపై స్థానికుల దాడి
గాయపడిన వారిలో దాదాపు 15 మంది బిజెపి కార్యకర్తలుగా తెలుస్తుంది. ఘటన తర్వాత గాయపడిన వారిని వెంటనే భువనేశ్వర్ ఎయిమ్స్ కు తరలించారు. ఈ ఘటన జరిగిన అనంతరం ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు వెంటనే ఎమ్మెల్యే కారుపై దాడి చేశారు. ఎమ్మెల్యే వాహనాన్ని ధ్వంసం చేశారు. ఎమ్మెల్యేను బయటకు లాగి తీవ్రస్థాయిలో దాడికి పాల్పడ్డారు. ప్రజల పైనుంచి వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపిన ఎమ్మెల్యే ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఎమ్మెల్యేను కాపాడిన పోలీసులు; ఆస్పత్రిలో గాయపడిన ఎమ్మెల్యే
ఇక ఎమ్మెల్యేపై స్థానికుల దాడి నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు దాడి నుండి ఎమ్మెల్యేను కాపాడి ఆసుపత్రికి తరలించారు. ప్రజలు ఎమ్మెల్యేను తీవ్రంగా కొట్టడంతో మొదట ఆయనను తంగి ఆస్పత్రిలో చేర్పించారు. ఆపై భువనేశ్వర్ లోని ఆసుపత్రికి ఎమ్మెల్యేను తరలించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జగదేవ్ కూడా చికిత్స పొందుతున్నాడు.

ఘటనపై దర్యాప్తు జరుగుతుందన్న ఖుర్దా ఎస్పీ అలేఖ్ చంద్ర పాధి
ఈ ఘటన పై దర్యాప్తు జరుగుతోందని ఖుర్దా ఎస్పీ అలేఖ్ చంద్ర పాధి తెలిపారు. గత ఏడాది అక్టోబర్‌లో స్థానిక బీజేపీ నాయకుడిపై దాడి చేశారన్న ఆరోపణలపై అధికార బిజూ జనతాదళ్ నుంచి జగదేవ్ సస్పెండ్ అయ్యారు. ఖుర్దా జిల్లా ప్రణాళికా సంఘం అధ్యక్ష పదవి నుంచి కూడా జగదేవ్‌ను తొలగించారు. మరోవైపు ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ హరిశ్చంద్ర డిమాండ్ చేశారు. ప్రజల పై ఎమ్మెల్యే వాహనం దూసుకుపోయిన ఘటనలో బాణాపూర్ ఐఐసి, ఎమ్మెల్యే, జర్నలిస్టు, సహా పది మంది పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications