మోదీ 70వ విదేశీ పర్యటన: మన్మోహన్ సింగ్ తరువాత రెండో ప్రధానిగా ఆ ఘనత
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఫ్రాన్స్ పర్యటన ఇంకొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. గురువారం ఆయన న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఫ్రాన్స్‌కు బయలుదేరి వెళ్తారు. ఆ దేశ కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 12:30 గంటలకు పారిస్‌లో ల్యాండ్ అవుతారు. రెండురోజుల పాటు ఆయన అక్కడే ఉంటారు. బాస్టిల్ డే పరేడ్ సహా వివిధ అధికారిక కార్యక్రమాలు, ద్వైపాక్షిక భేటీల్లో పాల్గొంటారు.
2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయన చేసిన విదేశీ పర్యటనల్లో ఇది 70వది. మధ్యాహ్నం 12:30 గంటలకు పారిస్‌లో దిగిన అనంతరం తాను బస చేయాల్సిన హోటల్‌కు వెళ్తారు. అక్కడ ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు.

సాయంత్రం 4:05 నిమిషాలకు ఫ్రాన్స్ సెనెట్ చీఫ్ గెరార్డ్ లార్చర్‌తో భేటీ అవుతారు. 5:15 నిమిషాలకు ఆ దేశ ప్రధాని ఎలిజబెత్ బోర్నెను మర్యాదపూరకంగా కలుసుకుంటారు. 7:35 నిమిషాలకు కమ్యూనిటీ ఈవెంట్‌లో పాల్గొంటారు ప్రధాని మోదీ. రాత్రి 9 గంటలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయెల్ మాక్రాన్ ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు.
అనంతరం మోదీ- మాక్రాన్ కలిసి ఈఫిల్ టవర్‌ను సందర్శిస్తారు. మోదీ రాకను పురస్కరించుకుని ఈఫిల్ టవర్ వద్ద భారీ ఎత్తున బాణాసంచాను కాల్చనున్నారు. రెండో రోజు అంటే శుక్రవారం పారిస్‌లో జరిగే బాస్టిల్ డే సెలబ్రేషన్స్‌కు హాజరవుతారు మోదీ. ఈ ఉత్సవాలకు ఆయనను గౌరవ అతిథిగా ఆహ్వానించింది ఫ్రాన్స్.
ఈ సందర్భంగా మోదీకి రెడ్ కార్పెట్ స్వాగతం పలకనుంది ఫ్రాన్స్ ప్రభుత్వం. బాస్టిల్ డే పరేడ్‌లో రెడ్ కార్పెట్ స్వాగతాన్ని అందుకోనున్న రెండో భారత ప్రధాని ఆయనే. 2009లో అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్.. బాస్టిల్ డే పరేడ్‌లో రెడ్ కార్పెట్ స్వాగతాన్ని అందుకున్నారు. తన పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ.. రాఫెల్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. మొత్తం 26 రాఫెల్ జెట్ ఫ్లైట్‌ను కొనుగోలు చేయనుంది భారత్. వీటి విలువ 90,000 కోట్ల రూపాయలు.












Click it and Unblock the Notifications