అవిశ్వాసంపై మోదుగుల నోటీస్, సభలో జగన్ స్లోగన్స్
న్యూఢిల్లీ: లోకసభలో కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అవిశ్వాస తీర్మానంపై నోటీసు ఇచ్చారు. దీనికి పలు పార్టీల మద్దతు లభించింది. టిడిపి తరఫున మోదుగుల అవిశ్వాసంపై నోటీసు ఇవ్వగా, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఇవ్వలేదు.
లోకసభ బుధవారానికి వాయిదా పడిన అనంతరం మోదుగుల మాట్లాడుతూ.. తాను ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఇచ్చిన నోటీసుకు మద్దతు లభించినా స్పీకర్ సభను వాయిదా వేశారని విమర్శించారు. తన నోటీసుకు బిజెడి(14), శివసేన(11), అకాళీదళ్(4), ఎఐఎడిఎంకె(9), ఎండిఎంకె(1), ఏజిపి(1) మద్దతు లభించిందన్నారు. అయినా స్పీకర్ సభను వాయిదా వేశారన్నారు.

సభలో జగన్ సమైక్య హోరు
అంతకుముందు లోకసభలో సీమాంధ్ర కాంగ్రెసు, తెలుగుదేశం పార్లమెంటు సభ్యులతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి లోకసభలో సమైక్య నినాదాలు చేశారు. జై సమైక్యాంధ్ర, సమైక్యాంధ్రతో తెలుగు వారిని కాపాడాలని జగన్ నినాదాలు చేశారు. సహచర ఎంపీలు ఎస్పీవై రెడ్డితో కలిసి సభాపతి పోడియం వద్ద జగన్ నిరసన తెలిపారు.
కాగా, లోకసభలో సీమాంధ్ర ఎంపీల సమైక్య నినాదాలు, విపక్ష సభ్యుల ఆందోళనలతో సభలో గందరగోళం ఏర్పడింది. ఈ గందరగోళం మధ్యనే పలు బిల్లులను ప్రవేశ పెట్టేందుకు స్పీకర్ అనుమతించారు. మోదుగుల ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు పైన స్పీకర్ అభిప్రాయం కోరగా.. పలు పార్టీలు మద్దతు తెలిపాయి. అయినా చర్చకు రాకుండానే సభను వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications