కేరళలో మంకీ ఫీవర్ కలకలం; తొలికేసు నమోదు; మంకీ ఫీవర్ లక్షణాలు ఇవే!!
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి మాత్రం వణికిస్తోంది. భారీగా కేసులు నమోదు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది .ఇక ఇదే సమయంలో మరో కొత్త వ్యాధి కేరళ ప్రజలను కలవరపెడుతోంది. కేరళ రాష్ట్రంలో మంకీ ఫీవర్ కలకలం సృష్టిస్తోంది.

కేరళలో మంకీ ఫీవర్ తొలికేసు నమోదు
కేరళ వాయనాడ్‌లో గురువారం మంకీ ఫీవర్ కేసు నమోదైంది. తిరున్నెల్లి గ్రామ పంచాయితీలోని పనవల్లి గిరిజన గ్రామానికి చెందిన 24 ఏళ్ల వ్యక్తికి టిక్-బర్న్ వైరల్ హెమరేజిక్ ఫీవర్ కనుగొనబడింది. కేరళలో మూడవ కోవిడ్-19 తరంగం క్షీణిస్తున్న ధోరణిని చూపుతున్న సమయంలో మంకీ ఫీవర్ ఆందోళన కలిగిస్తుంది. వయనాడ్ జిల్లాకు చెందిన 24 సంవత్సరాల యువకుడికి ఈ వైరస్ సోకిన ట్లుగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ సకీనా ధ్రువీకరించారు. ఆరోగ్య అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేశామని, స్థానిక ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.

కోతుల నుంచి మనుషులకు సంక్రమించే వైరల్ ఫీవర్ మంకీ ఫీవర్
ప్రస్తుతం మంకీ ఫీవర్ సోకిన యువకుడి పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు చెబుతున్నారు. మంకీ ఫీవర్ సోకిన వ్యక్తిని మనంతవాడి మెడికల్ కాలేజీలో చేర్చి, వైద్యులు పరిశీలిస్తున్నారని వెల్లడించారు. ఈ సంవత్సరం మంకీ ఫీవర్ కేసు నమోదు కావడం ఇదే తొలిసారి. కోతుల నుంచి మనుషులకు సంక్రమించే వైరల్ ఫీవర్ మంకీ ఫీవర్. ఈ ఫీవర్ ఫ్లావివిరిడే కుటుంబానికి చెందిన వైరస్ ద్వారా సోకుతుందని నిపుణులు పేర్కొన్నారు. అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు ఉండటం దీని లక్షణాలని పేర్కొన్నారు.

మంకీ ఫీవర్ లక్షణాలివే... ప్రత్యేకమైన చికిత్స లేదు
మంకీ ఫీవర్ కు డెంగీ లక్షణాలు కూడా ఉంటాయని, 5-10శాతం మరణాలు సంభవిస్తాయని తెలిపారు. చనిపోయిన కోతలను తాకడం ద్వారా ఇన్ ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకిన వారు ముఖ్యంగా జ్వరం విపరీతమైన తలనొప్పి, వికారంగా ఉండటం, వాంతులు అవుతుండడం,కండరాలు పట్టేయడం, కంటి దృష్టి తగ్గిపోవడం, ప్రతిస్పందనలు తగ్గిపోవడం వంటి లక్షణాలతో బాధపడుతుంటారు. కరోనా మహమ్మారి తరహాలోనే మంకీ ఫీవర్ కు ఎటువంటి ప్రత్యేకమైన వైద్య చికిత్స అందుబాటులో లేదు. లక్షణాలను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది.

కర్ణాటక రాష్ట్రంలోని క్యాసనూర్ ఫారెస్ట్ లో పుట్టిన మంకీ ఫీవర్
మొదటిసారిగా కర్ణాటక రాష్ట్రంలోని క్యాసనూర్ ఫారెస్ట్ లో మంకీ ఫీవర్ బయటపడింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. 2012 నుండి ప్రతి ఏటా 500 మందికి పైగా మంకీ ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి. ఐదేళ్ల కాలంలో ఈ వ్యాధి కారణంగా 340 మంది ప్రాణాలను కోల్పోయారు.మంకీ ఫీవర్ ద్వారా ప్రభావితమైన వారిలో 5 శాతం నుంచి 10 శాతం మంది బాధితులు రక్తస్రావ లక్షణాలతో ప్రాణాలను కోల్పోతున్నారు.












Click it and Unblock the Notifications