దారిలేకే: పెప్పర్ స్ప్రేపై లగడపాటికి ములాయం బాసట
లక్నో/హైదరాబాద్: విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ లోకసభలో పెప్పర్ స్ప్రే చేయడం విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. అయితే, సమాజ్ వాది పార్టీ అధినేత, యుపి మాజీ సిఎం ములాయం సింగ్ యాదవ్ మాత్రం లగడపాటికి బాసటగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజించడానికి కాంగ్రెస్ ప్రయత్నింస్తుండడంతో తన ఆగ్రహాన్ని తెలియజేయడానికి వేరే దారిలేకే లగడపాటి ఆవిధంగా చేశారని ములాయం చెప్పారు.
ఆయనను తప్పుపట్టడం సరికాదన్నారు. వేరే దారిలేకే ఆ ఎంపీలు పార్లమెంట్‌లో గందరగోళం సృష్టించారన్నారు. వారు ఏం చేసినా అది కాంగ్రెస్, బిజెపిల విభజన రాజకీయాల పట్ల ఆగ్రహంతో చేసినదేనని, ఆ రెండు పార్టీలూ దేశాన్ని విభజించాలని చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోతే తమ ప్రాంత ప్రజల దగ్గరకు కూడా వెళ్లలేని పరిస్థితులు నెలకొనడంతో భావోద్వేగంతో ఆ ఎంపీలు గందరగోళానికి పాల్పడ్డారని వివరణ ఇచ్చారు.

విచారణ
మరోవైపు లోక్‌సభలో పెప్పర్ స్ప్రే ప్రయోగ ఘటనపై విచారణ జరిపి, నివేదిక ఇవ్వాల్సిందిగా లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ పార్లమెంటు సభాహక్కుల సంఘాన్ని ఆదేశించారు. 13న లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాలరెడ్డి పెప్పర్ స్ప్రే వినియోగించడం, టిడిపి ఎంపీ మైకు విరగ్గొట్టి గందరగోళం సృష్టించడంపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని స్పీకర్ కోరినట్లు లోక్‌సభ సచివాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
సీనియర్ కాంగ్రెస్ నేత పిసి చాకో నేతృత్వంలోని 15 మంది సభ్యుల ఈ కమిటీకి సభలో హద్దుమీరి ప్రవర్తించే సభ్యులకు జైలుశిక్ష విధించాలని సిఫార్సు చేసే అధికారం ఉంది. పెప్పర్ స్ప్రే లాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు సోమవారం పార్లమెంటు భద్రతాకమిటీ సమావేశం కానుంది. సభలోకి మారణాయుధాలను తీసుకురాకుండా ఎంపీలను సైతం క్షుణ్ణంగా తనిఖీ చేయడంపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది.












Click it and Unblock the Notifications