తిరగబడినా నా కొడుకే కదా: ములాయం, 'కొంతమంది'పై అసహనం
అఖిలేష్ యాదవ్‌తో ఎలాంటి విభేదాలు లేవని ములాయం సింగ్ యాదవ్ సోమవారం నాడు అన్నారు.
లక్నో: అఖిలేష్ యాదవ్‌తో ఎలాంటి విభేదాలు లేవని ములాయం సింగ్ యాదవ్ సోమవారం నాడు అన్నారు. తాను ఇప్పుడు లక్నో వెళ్తున్నానని, తమ పార్టీ అభ్యర్థులకు టిక్కెట్లు ఇస్తామని చెప్పారు. సైకిల్ గుర్తు ఎవరిదో ఈసీ గుర్తిస్తుందన్నారు.
యూపీ బీజేపీదే, కానీ అది పెద్ద సవాల్: మోడీ కంటే అఖిలేష్ బెస్ట్!
తమ పార్టీలో ఎలాంటి వివాదంలేదన్నారు. తాను పార్టీ అధినేతను అని, తన కుమారుడు ముఖ్యమంత్రి, శివపాల్ యాదవ్ యూపీ పార్టీ శాఖ అధ్యక్షులు అన్నారు. రాంగోపాల్ యాదవ్ బహిష్కృత నాయకుడు అన్నారు. ఇక తమ పార్టీలో వివాదం ఎక్కడ ఉందని ప్రశ్నించారు.
ఆదివారం ఎస్పీ నేతలు శివపాల్ సింగ్, అమర్ సింగ్‌లతో కలిసి ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తమ కుటుంబం, పార్టీ, ప్రభుత్వంలో రాజుకొన్న ఆధిపత్య విభేదాలను తేలిగ్గా కొట్టివేశారు.

తిరగబడినా నా కొడుకే..
తిరుగుబాటుదారుగా మారినా, అఖిలేశ్ ఇప్పటికీ తన కుమారుడేనని, పార్టీని తిరిగి గాడిలో పెడతానని ములాయం తెలిపారు. దీనిపై మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. జర్నలిస్టులపై ఒకింత ఆగ్రహించారు.

నాతో కొంతమందే..
అంతకుముందు, పార్టీ ప్రధాన కార్యాలయంలో మద్దతుదారులతో ఆయన భేటీ అయ్యారు. తన వెంట కొద్దిమంది తప్ప, అంతా అఖిలేశ్‌తోనే ఉందని ఆయన ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. కార్యాలయం బయట మాత్రం మీడియా ఎదుట ములాయం హుషారుగా కనిపించారు.

ఢిల్లీకి వెళ్లి.. ఆ తర్వాత
ఆ తర్వాత ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీలో మాట్లాడుతూ.. విభేదాలు లేవని చెప్పారు. తాను లక్నో వెళ్తున్నానని అన్నారు. అమర్ సింగ్ తదితరులతో కలిసి ఈసీని సైకిల్ గుర్తు కోసం కలిశారు. ఇందుకోసం కీలక పత్రాలు తీసుకెళ్లారు.

రాహుల్ గాంధీతో అఖిలేష్ భేటీ
కాగా, సైకిల్ గుర్తు పైన ఎన్నికల కమిషన్ ఈ నెల 17వ తేదీన నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘంతో అఖిలేష్ వర్గం కూడా భేటీ కానుంది. సైకిల్ గుర్తు తమకే కేటాయించాలని కోరనుంది. అనంతరం రాహుల్ గాంధీతో అఖిలేష్ భేటీ కానున్నారు. కాంగ్రెస్ - అఖిలేష్ వర్గం పొత్తుతో వెళ్లే విషయమై చర్చిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications