వినూత్నం: ప్లాస్టిక్ సీసాలు యంత్రంలో వేస్తే.. డిస్కౌంట్ కూపన్లు!
ముంబై మెట్రోరైలు సంస్థ ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు వినూత్న చర్యలు చేపట్టింది. వివిధ మెట్రో రైల్వే స్టేషన్లలో ప్లాస్టిక్ సీసాలను రీసైకిల్ చేసే యంత్రాలను ఏర్పాటు చేసింది.
ముంబై : ముంబై మెట్రోరైలు సంస్థ ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు వినూత్న చర్యలు చేపట్టింది. వివిధ మెట్రో రైల్వే స్టేషన్లలో ప్లాస్టిక్ సీసాలను రీసైకిల్ చేసే యంత్రాలను ఏర్పాటు చేసింది.
ముంబై నగరంలోని ద్రాన్‌నగర్, అంధేరి, చకల, మారోల్‌నాకా, సాకినాకా, ఘట్కోపర్ మెట్రో రైల్వే స్టేషన్లలో ప్లాస్టిక్ బాటిళ్లను వేసేందుకు వీలుగా రిఫ్రిజిరేటర్ సైజులో కొత్తగా యంత్రాలను ఏర్పాటు చేసింది.

ప్రయాణికులు తమ వద్ద ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లు ఈ యంత్రంలో వేయగానే వాటిని క్రష్ చేసి రీసైకిల్ చేసేందుకు ఉపయోగించుకునేలా చేస్తాయి. అంతేకాదు, ప్రయాణికులు ప్లాస్టిక్ బాటిళ్లు ఈ యంత్రంలో వేయగానే దాన్నుంచి డిస్కౌంటు కూపన్లు బయటకు వస్తాయి.
ఈ డిస్కౌంట్ కూపన్లతో 20 నుంచి 25 శాతం వరకు రాయితీపై దుస్తులు, కళ్లజోళ్లు కొనవచ్చు. ఇలా క్రష్ చేసిన ప్లాస్టిక్ సీసాల పొడిని ఫైబర్, బట్టలు, కార్పెట్ల తయారీకి ఉపయోగిస్తారు.
ఖాళీ ప్లాస్టిక్ సీసాలు పడేయకుండా మెట్రోరైలు సంస్థ రీసైకిల్ చేయించి పర్యావరణానికి సహాయ పడుతోంది. దీంతో ముంబై నగరంలో ప్రయాణికులు ఖాళీ సీసాలను వృథాగా పడేయడం లేదు. ఎంచక్కా ఈ యంత్రాల్లో వేసి డిస్కౌంట్ కూపన్లు పొందుతున్నారు. మరి.. మనకెప్పుడొస్తుందో ఇలాంటి సదుపాయం.












Click it and Unblock the Notifications