‘‘అవి బలహీన క్షణంలో వచ్చిన కన్నీళ్లు కావు.. అండ చూసుకుని వచ్చిన ఆనందభాష్పాలు’’
బీజేపీ ఎమ్మెల్యే తనపై దూషణకు దిగిన సమయంలో తాను బలహీన మనస్కురాలై కన్నీళ్లు పెట్టుకోలేదని, నిజానికి అవి ఆనందభాష్పాలని ఐపీఎస్ అధికారిణి చారు నిఘమ్ వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: బీజేపీ ఎమ్మెల్యే తనపై దూషణకు దిగిన సమయంలో తాను బలహీన మనస్కురాలై కన్నీళ్లు పెట్టుకోలేదని, ఒక మహిళా పోలీసు అధికారికి అండగా వచ్చి నిలిచిన పోలీసు బలగాన్ని చూసి భావోద్వేగంతో వచ్చిన ఆనందభాష్పాలని ఐపీఎస్ అధికారిణి చారు నిఘమ్ వ్యాఖ్యానించారు.
అందరూ చూస్తుండగా గోరఖ్‌పూర్ బీజేపీ ఎమ్మెల్యే రాధామోహన్ దాస్ అగర్వాల్ ఆదివారం పోలీసు సర్కిల్ అధికారి చారు నిగమ్‌పై దూషణకు దిగిన విషయం తెలిసిందే. 'నోర్మూసుకుని ఉండు. నేను నీతో మాట్లాడడం లేదు. హద్దు మీరొద్దు. నాకు పాఠాలు చొప్పొద్దు. నా సహనాన్ని పరీక్షించొద్దు..'అంటూ ఆమె వైపు చేతివేలు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చారాయన. ఆ సమయంలో ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు.
తనపట్ల ఎమ్మెల్యే అమర్యాదగా ప్రవర్తించారని, ఓ మహిళతో మాట్లాడుతున్నానన్న విచక్షణ కూడా ఆయన మర్చిపోయారని చారు నిగమ్ ఆరోపించారు. అయితే, తనకు కన్నీళ్లు వచ్చింది తన బలహీనతతో కాదని స్పష్టం చేశారు. తాను తీసుకున్న శిక్షణలో భయాలు, బలహీనతలు నేర్పలేదని వ్యాఖ్యానించారు.

నగర సీనియర్ అధికారి అయిన ఎస్పీ గణేశ్ సహా తనకు అండగా నిలబడి, తనకు జరిగిన అవమానం గురించి మాట్లాడే సమయంలో భావోద్వేగానికి లోనయ్యానని, అవి కన్నీళ్లు కాదని, ఆనందభాష్పాలని ఆమె పేర్కొన్నారు.
నలుగురిలో తనను అవమానిస్తుండగా పోలీసు బలగంతో వచ్చి తనకు ఎస్పీ గణేశ్ అండగా నిలవడం చూసి భావోద్వేగానికి లోనైనట్లు ఐపీఎస్ అధికారిణి చారు నిఘమ్ వివరించారు. మీడియా కూడా ఈ విషయంలో తనకు అండగా నిలిచిందని, అందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications