National Bird Day 2022: బుల్లి పిట్ట.. బుజ్జి పిట్ట జాడేది..
ఉదయం లేవగానే ప్రకృతిని ఆస్వాదిస్తూ, ప్రశాంతమైన వాతావరణంలో ఎగిరే బుజ్జి బుజ్జి పిట్టల్ని, పావురాల్ని, పిచ్చుకల్ని చూస్తోంటే వచ్చే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. కానీ ఇప్పడు ఆ పక్షుల కిలకిలరావాలు ఎక్కడ వినిపిస్తున్నాయి. ఆ చిన్ని బుల్లి పిట్టల జాడ ఎక్కడ కనిపిస్తుంది. ఆ ఆవేదన నుంచి పుట్టుక వచ్చిందే ఈ నేషనల్ బర్డ్ డే. అంతరించిపోతున్న పక్షుల్ని కాపాడుకునేందుకు, ప్రస్తుత పరిస్థితిల్లో పక్షుల అవసరం ఎంత ఉందో, పక్షుల ఉనికిపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతీ సంవత్సరం జనవరి 5న జాతీయ పక్షుల దినోత్సవాన్ని పాటిస్తారు.
ప్రస్తుత పర్యావరణ వ్యవస్థలలో కాలానుగుణ మార్పులతో చాలా రకాల పక్షులు, పిట్టలు అంతరించిపోతున్నాయి. ముఖ్యంగా నశించిపోతున్న అడవులు, సెల్ టవర్లు, ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా పిచ్చుకలనేవి నేటి కాలంలో కనిపించడం లేదు. పెంపుడు జంతువులంటే ఇప్పటి కాలంలో ఎక్కువగా కుక్కలు, పిల్లులు మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ, అప్పట్లో పెంపుడు జంతువులంటే, బాతులు, పిచ్చుకలు, చిలుకలు, పావురాలు, నెమళ్లు, చిలుకలు, కోకిలను కూడా పెంచుకునేవారు. కానీ, ఇప్పడున్న పరిస్థితుల్లో వీటి మనుగడే కరువయ్యింది. నిజం చెప్పాలంటే నేటి పిల్లలకు అసలు పిట్టలు, పక్షుల పేర్లే తెలీవు. పుస్తకాల్లోనూ, కంప్యూటర్‌లోనూ చూసి తెలుసుకోవాల్సిందే తప్ప.

ఇక, భారతదేశంలో అయితే, కనుమరుగువుతున్న పక్షుల జాబితాలో, రాబందులు, గద్దలు, పిచ్చుకలు మొదటిస్థానంలో ఉన్నాయట. ఇక, కూ..కూ.. అని తన మధురమైన గాత్రంతో అలరించే కోకిలమ్మ జాడే లేదు. ఇక, ఇదే జాబితాలో పావురాలు కూడా చేరిపోయాయి. ఇప్పడంటే, ఫేస్‌బుక్, వాట్సఫ్ సోషల్‌మీడియా వరమైంది. అప్పట్లో పోస్టుమ్యాన్లు, ఉత్తరాలు లేని కాలంలో పావురాలే కదా కీలక సందేశాలను చేరవేసింది. అటువంటి పావురాల జాడకూడా ఇప్పడు కనిపించడం లేదు.
జాతీయ పక్షుల దినోత్సవాన్ని 2002లో ప్రారంభించారు : ప్రస్తుతం ప్రపంచంలోని ఉన్న పక్షుల్లో 20 శాతానికి పైగా పక్షులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని సమాచారం. సుమారు 20 వేల జాతులకు ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద సంఖ్యలో పక్షులను కాపాడుకోవాలంటే అందులో కీలకపాత్ర పోషించాల్సిందే మనుషులే. ఎందుకంటే మనిషి చేసే పనుల వల్లే పక్షులకు నివాసాలు, ఆహారం, అడవులు లేక అవి అంతరించిపోయే దశకు చేరుకుంటున్నాయి. పట్టణీకరణ, అడవులు నరికేయడం, పక్షులు గూళ్లు కట్టేందుకు చెట్లు లేకపోవడం వంటి వాటి వల్ల పక్షుల క్రమంగా అంతరించిపోతున్నాయి. ఈ ప్రత్యేకమైన రోజును 2002లో అమెరికాలో ప్రారంభించారు. అప్పటినుంచి ఇప్పటివరకూ జనవరి 5న జాతీయ పక్షుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications