ఎన్‌డిఎ పరీక్షలు : బాలికలకు అవకాశం ఇవ్వరా ? ఇండియన్ ఆర్మీకి సుప్రీంకోర్టు అక్షింతలు !!
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డిఎ), సైనిక్ స్కూల్స్ మరియు ఇతర సైనిక సంస్థలలో మహిళా అభ్యర్థులను అనుమతించనందుకు ఇండియన్ ఆర్మీ తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. సెప్టెంబర్ 5వ తేదీన జరగనున్న ఎన్డీఏ పరీక్షలో బాలికలకు అవకాశం ఇవ్వకపోవడంతో కోర్టును ఆశ్రయించిన బాలికా అభ్యర్థినులకు అవకాశమివ్వాలని అత్యున్నత న్యాయస్థానం తాజా ఆదేశాలలో స్పష్టంగా పేర్కొంది. ఇండియన్ ఆర్మీపై విరుచుకుపడింది. ఎన్డీఏ పరీక్షలలో, సైనిక పాఠశాలలలో, ఇతర మిలటరీ సంస్థలలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఇండియన్ ఆర్మీని ప్రశ్నించింది.

ఆర్మీ వాదనతో సుప్రీం మండిపాటు .. బాలికలకు అవకాశం ఇస్తే తప్పేంటి ? అని ప్రశ్న
తమ విధి విధానాల్లో భాగంగా బాలికలకు స్థానం కల్పించడం లేదని సుప్రీం ధర్మాసనం దృష్టికి ఇండియన్ ఆర్మీ తీసుకువెళ్ళింది. ఇది ఇండియన్ ఆర్మీ అభివృద్ధి చెందని, తిరోగమన మైండ్ సెట్ కు నిదర్శనమని సుప్రీం ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. లింగవివక్ష చూపించవద్దని పేర్కొంది. ప్రతిసారి పరీక్షలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయడానికి న్యాయ వ్యవస్థ ఎందుకు అవసరం అవుతుంది అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. బాలికలకు కూడా అవకాశం ఇస్తే తప్పేంటని ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం, ఇండియన్ ఆర్మీ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

బాలికలు ఎన్‌డిఎ పరీక్ష రాయటానికి అనుమతిస్తున్నామన్న సుప్రీం
మీరు న్యాయవ్యవస్థకు బాలికలకు ఎన్డిఎ పరీక్ష రాసే అవకాశం లేకుండా ఆదేశాలు ఇవ్వడం కొనసాగించమని బలవంతం చేస్తున్నారని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం, కోర్టు తమకు అనుకూలంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుకోవడం కంటే ఆర్మీ దీనిని నిర్మించడం మంచిదని, బాలికల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్యానించింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బాలికలను ఎన్‌డిఎ పరీక్షకు అనుమతించడానికి మేము అనుమతిస్తున్నామని, దీనిని చాలా తీవ్రమైన సమస్యగా పరిగణిస్తున్నామని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది.

మహిళలకు అవకాశాల్లో నేవీ, ఎయిర్ ఫోర్స్ కంటే ఆర్మీ వెనుకబడిందన్న సుప్రీం
అదే సమయంలో ఎన్‌డిఎ పరీక్షను రాయాలి అనుకుంటున్న బాలికలను మధ్యంతర చర్యల్లో భాగంగా తీసుకోవాలని కోర్టు అనుమతించింది. " సెప్టెంబర్ 5 న ఎన్‌డిఎలో బాలికల ప్రవేశ సమస్యను ఒక విధానంగా పరిగణిస్తాము" అని సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ ఎస్‌కె కౌల్ మరియు హృషికేష్ రాయ్ వెల్లడించారు. బాలికలు, మహిళా అభ్యర్థులపై "నిరంతర లింగ వివక్ష" పై భారత సైన్యంపై బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల విషయంలో భారత నావికాదళం మరియు వైమానిక దళం ఇప్పటికే ఏర్పాట్లు చేసినప్పటికీ, భారత సైన్యం ఇంకా వెనుకబడి ఉందని చెప్పారు.
Recommended Video

మార్పులేని మీ మనస్తత్వానికి అద్దం పడుతుందని ఆర్మీకి కోర్టు అక్షింతలు
ఇప్పటివరకు మహిళల ప్రవేశానికి శాశ్వత కమిషన్ ఏర్పాటు చెయ్యలేదని, సుప్రీంకోర్టు మెట్లు ఎక్కే వరకు మహిళల అంశాన్ని చట్టం లోనూ, ఇతర విభాగాల్లోనూ చేర్చలేదని ధర్మాసనం ఇండియన్ ఆర్మీ అని ప్రశ్నించింది. ఇది మార్పులేని మీ మనస్తత్వానికి అద్దం పడుతుందని కోర్టు ఇండియన్ ఆర్మీ ని తప్పు పట్టింది. కోర్టు ఆదేశాలకు లోబడి అడ్మిషన్లు ఉంటాయని తన తీర్పులో తెలిపింది. ఆర్మీకి సంబంధించిన సైనిక పాఠశాలలలో కొన్ని విభాగాల్లో బాలికలకు ప్రవేశం లేదు. కేవలం బాలురు మాత్రమే ఎన్డీఏ పరీక్షలు రాసి ప్రవేశాలు పొందడానికి అర్హులు. అయితే ఈ క్రమంలో ఎన్డీఏ పరీక్ష రాసి ఆర్మీ స్కూల్స్ లో చదువుకోవాలి అనుకుంటున్న బాలికలు కోర్టును ఆశ్రయించడంతో ఆర్మీ లో లింగ వివక్ష పై సుప్రీం ధర్మాసనం ఇండియన్ ఆర్మీ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలికలకు కూడా అవకాశాలు కల్పించాలని తేల్చిచెప్పింది.












Click it and Unblock the Notifications