NEET PG 2021: సెప్టెంబర్ 11న పరీక్ష -కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ వెల్లడి, 12న NEET UG
దేశంలో మెడికల్ కోర్సుల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ (నీట్-పీజీ) పరీక్షను సెప్టెంబర్ 11న నిర్వహించనున్నట్లు ఆ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం ప్రకటన చేశారు.
నిజానికి నీట్ పీజీ పరీక్ష గత ఏప్రిల్ 18న జరగాల్సి ఉండగా, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం విద్యార్థులను సైతం ఆస్పత్రుల్లో సేవలు అందించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించడం, ఆ సమయంలో నీట్ పీజీ, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌కు వ్యతిరేకంగా పలువురు యువ డాక్టర్లు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం పరీక్షను వాయిదా వేసింది.

నీట్ పీజీని ఆగస్టు వరకు నిర్వహించబోమని అప్పటి ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ప్రకటన చేయడం, పరీక్ష నిర్వహణ తేదీని అభ్యర్థులకు ఒక నెల ముందుగానే తెలియజేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో కొత్త మంత్రి మాండవీయ నీట్ పీజీ పరీక్ష తేదీని ఇవాళ ఖరారు చేశారు. సెప్టెంబర్ 11న నీట్ (పీజీ) పరీక్ష నిర్వహిస్తామని కొత్త మంత్రి ట్వీట్ చేశారు. కాగా,
నీట్ పీజీ, మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ యూజీ పరీక్షలు రెండు రోజుల వ్యవధిలోనే నిర్వహిస్తుండటం గమనార్హం. నీట్ అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షను సెప్టెంబర్ 12న నిర్వహిస్తుండగా, నీట్ పీజీని అదేనెల 11వ తేదీని నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications