ITR 2026: రెండుసార్లు రిటర్న్ ఫైల్ చేయాలా? ఐటీ శాఖ క్లారిటీ ఇదే!
కొత్త ఆదాయపు పన్ను చట్టం, 2025 అమలులోకి వచ్చిన నేపథ్యంలో దేశంలోని పన్ను చెల్లింపుదారుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రత్యేకించి 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త చట్టంలో "అసెస్మెంట్ ఇయర్" (AY) స్థానంలో "టాక్స్ ఇయర్" అనే పదాన్ని ప్రవేశపెడుతుండటంతో, తాము ఒకే ఆర్థిక సంవత్సరానికి రెండుసార్లు ఐటీ రిటర్నులు (ITR) దాఖలు చేయాల్సి ఉంటుందేమోనని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆదాయపు పన్ను శాఖ ఈ వ్యవహారంపై స్పష్టమైన వివరణ ఇచ్చింది.
రెండు ఐటీ రిటర్న్ లు (ITR 2026)
ఐటీ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, పన్ను చెల్లింపుదారులు ఒకే ఆదాయానికి రెండు రకాల రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేదు. నిబంధనలలో మార్పులు జరిగినప్పటికీ, పాత చట్టం కింద కొనసాగిన విధానమే ప్రస్తుతానికి అమలవుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను చెల్లింపు ప్రక్రియ మునుపటి సాధారణ నిబంధనల ప్రకారమే కొనసాగుతుందని, దీనిపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని అధికారులు పన్ను చెల్లింపుదారులకు స్పష్టం చేశారు.

ఐటీ శాఖ క్లారిటీ
2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు సంపాదించిన ఆదాయాన్ని అసెస్మెంట్ ఇయర్ (AY) 2026-27 కింద చూపించాల్సి ఉంటుంది. కొత్త ఐటీ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రిటర్నులను ఫైల్ చేసినప్పటికీ, ఇది పాత చట్టం (ఆదాయపు పన్ను చట్టం, 1961) పరిధిలోకి వస్తుంది. ఇందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐటీఆర్-1, ఐటీఆర్-2, ఐటీఆర్-3, ఐటీఆర్-4, ఐటీఆర్-5, ఐటీఆర్-6 మరియు ఐటీఆర్-7 వంటి ఫారాలనే యథాతథంగా వాడవచ్చు. సాధారణ వెబ్‌సైట్ పోర్టల్‌లోనే ఇవి అందుబాటులో ఉంటాయి. ఆడిట్ అవసరం లేని సాధారణ పన్ను చెల్లింపుదారులకు ఈ దాఖలుకు చివరి తేదీగా 2026 జూలై 31 ఉంటుంది.
అదనపు భారం
మరోవైపు కొత్త ఆదాయపు పన్ను చట్టం, 2025 ప్రకారం "టాక్స్ ఇయర్ 2026-27" అనేది 2026 ఏప్రిల్ 1 తర్వాత పొందే ఆదాయానికి మాత్రమే వర్తిస్తుంది. దీనికి సంబంధించిన రిటర్నుల దాఖలు ప్రక్రియ 2027లోనే ప్రారంభమవుతుంది. ఈ రెండు అసెస్మెంట్ కాలాల్లో పోర్టల్ పాత నిబంధనలకు, కొత్త మార్పులకు రెంటికీ అనుగుణంగా సేవలందిస్తుంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులపై అదనపు భారం ఏమీ పడదు.

పెనాల్టీలపై ఐటీ శాఖ క్లారిటీ
గడువు ముగిసిన తర్వాత రిటర్నులు దాఖలు చేసే వారికి విధించే పెనాల్టీల విషయంలో కూడా ఐటీ శాఖ స్పష్టత ఇచ్చింది. పాత చట్టానికి సంబంధించిన అసెస్మెంట్ ఇయర్ 2026-27 దరఖాస్తులకు సెక్షన్ 234F ప్రకారమే జరిమానాలు ఉంటాయని తెలిపింది. కొత్త టాక్స్ ఇయర్ 2026-27 నుంచి ఆలస్య రుసుములపై సెక్షన్ 428 వర్తిస్తుంది. దీని ప్రకారం 5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి రూ.1,000, అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి రూ.5,000 ఆలస్య రుసుము ఉంటుంది. మొత్తంగా, ఈ మార్పులతో పన్ను చెల్లింపుదారులు కంగారు పడాల్సిన అవసరం లేదని ఐటీ శాఖ తేల్చిచెప్పింది.














Click it and Unblock the Notifications