ఫాస్టాగ్ పై వాహనదారులకు బ్యాడ్ న్యూస్
ప్రతి వాహనానికీ అత్యవసరమైన ఫాస్టాగ్ లో.. భారీగా సవరణలు చోటు చేసుకున్నాయి. యాన్యువల్ పాస్ మొదలుకుని ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) వరకు పలు మార్పులు సంభవించాయి. అవన్నీ కూడా వాహనదారులకు అనుకూలంగా ఉన్నవే.. టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ ను నివారించడానికి ఉద్దేశించినవే. క్రమంగా టోల్ గేట్లల్లో కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పూర్తి స్థాయిలో అమలులోకి రాబోతోంది కూడా.
ఈ పరిణామాల మధ్య కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఫాస్టాగ్ లో తాజా సవరణలు చేసింది. జాతీయ రహదారులపై ఓవర్ లోడ్‌తో వెళ్లే వాహనాలు ఇకపై అధక టోల్ ట్యాక్స్ ను చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం 'నేషనల్ హైవేస్ ఫీ ఫోర్త్ అమెండ్‌మెంట్ రూల్స్ పేరుతో ప్రకటించిన ఈ మార్పులు నేటి నుండి అమలులోకి వచ్చాయి. అందుబాటులో ఉన్న డిజిటల్ వ్యవస్థలు.. ముఖ్యంగా ఫాస్టాగ్ ద్వారా చెల్లింపులను బలోపేతం చేయడం, హైవేలపై సురక్షిత ప్రయాణాన్ని కల్పించడం దీని ఉద్దేశం.

సవరించిన రూల్ 10 ప్రకారం- అనుమతించిన వాహన బరువును మించి అధిక లోడ్‌తో వెళ్లే వాహనాలు నేటి నుంచి అసెస్‌మెంట్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఓవర్‌లోడ్ రవాణాకు సంబంధించిన అసెస్‌మెంట్ ప్రక్రియ, అదనపు ట్యాక్స్, ఫాస్టాగ్ ద్వారా డిజిటల్ చెల్లింపుల్లో పూర్తిగా మార్పులు చేసింది కేంద్ర రోడ్డు రవాణా శాఖ. నిర్దేశించిన లోడ్ కంటే ఎంత మేర ఓవర్‌లోడ్ ఉందనే విషయాన్ని అసెస్మెంట్ చేసిన అనంతరం ఎంత అదనపు మొత్తాన్ని కట్టాల్సి ఉంటుందనేది నిర్ణయిస్తారు.
ఉదాహరణకు, 10 శాతం వరకు అదనపు లోడ్‌కు ఎటువంటి ఓవర్‌లోడ్ ఫీజు ఉండదు. 10 నుండి 40 శాతం వరకు ఓవర్ లోడ్ ఉంటే బేస్ రేటుకు రెండు రెట్లు ఎక్కువ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.. వాహనదారుడికి. అదేవిధంగా బరువు 40 శాతం కంటే ఎక్కువ ఉంటే బేస్ రేటుకు నాలుగు రెట్లు అధికంగా చెల్లించాలి. ఓవర్‌లోడింగ్‌ను టోల్ ప్లాజాల వద్ద ఉన్న అమర్చిన పరికరాల ద్వారా అసెస్మెంట్ చేస్తారు. ఈ పరికరాలు లేని టోల్ ప్లాజాలు ఎటువంటి ఓవర్‌లోడ్ రుసుము వసూలు చేయవు.
అదనపు మొత్తాన్ని నగదు రూపంలో టోల్ ప్లాజా సిబ్బంది స్వీకరించారు. డిజిటల్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ వసూలు పూర్తిగా ఫాస్టాగ్ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఫాస్టాగ్ లేని వాహనాలను ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం పక్కకు మళ్లిస్తారు. అదనపు బరువు ఉన్న వాహనాల వివరాలను నేషనల్ వెహికల్ రిజిస్టర్ (VAHAN)కు నివేదించడం కూడా తప్పనిసరి. కొత్త నిబంధనల అమలుకు ముందు ప్రారంభమైన కొన్ని ప్రైవేట్ పెట్టుబడి ప్రాజెక్టులకు ఇవి వర్తించవు.












Click it and Unblock the Notifications