Toll Plaza: టోల్ ప్లాజాల్లో భారీ అక్రమాలు-ఫేక్ యాప్స్ తో- ఈడీ తనిఖీలు..!
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న టోల్ ప్లాజాల్లో ( toll plaza) వాహనదారుల నుంచి ఫాస్టాగ్ ద్వారా కట్ అవుతున్న డబ్బుల్ని అక్రమ సాఫ్ట్ వేర్లు, యాప్ లు వాడి తమ ఖాతాలకు మళ్లిస్తున్న వైనం వెలుగుచూసింది. టోల్ ప్లాజాల్లో సాగుతున్న ఈ దోపిడీ ద్వారా (Toll Fraud ) మనీలాండరింగ్ సాగుతుందని గుర్తించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) రంగంలోకి దిగింది. ఇవాళ పలు రాష్ట్రాల్లో ఉన్న 14 టోల్ ప్లాజాల్లో తనిఖీలు చేపట్టింది. ఇందులో భారీగా అక్రమాలను గుర్తిస్తోంది. ఈ నేపథ్యంలో అక్రమ సాఫ్ట్ వేర్లను, సామాగ్రిని స్వాధీనం చేసుకుంటోంది.
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) పరిధిలోని వివిధ టోల్ ప్లాజాల వద్ద జరుగుతున్న భారీ ఆర్థిక అక్రమాలపై ఈడీ ఉక్కుపాదం మోపింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఇవాళ ఉదయం నుంచి దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. ఈడీ లక్నో జోనల్ కార్యాలయ అధికారులు వివిధ రాష్ట్రాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జమ్ముకశ్మీర్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా తో పాటు దేశ రాజధాని ప్రాంతం పరిధిలోని మొత్తం 14 కీలక ప్రదేశాలలో ఈ తనిఖీలు ఏకకాలంలో కొనసాగాయి.

మోసపూరిత మార్గాల్లో భారీ ఎత్తున టోల్ వసూళ్లు చేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు రంగంలోకి దిగారు. నిందితుల నుంచి దొరికిన కీలక పత్రాలు, డిజిటల్ సాక్ష్యాధారాల సేకరణే లక్ష్యంగా ఈ దాడులు సాగాయి. ఈ ఏడాది జనవరి 22 నాటి ఎఫ్‌ఐఆర్, మే 19 నాటి ఈసీఐఆర్ ఆధారంగా కొనసాగుతున్న ఈ దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగుచూశాయి. కొందరు నిందితులు అనధికారిక సాఫ్ట్‌వేర్ యాప్స్ ను వినియోగించి నకిలీ టోల్ రసీదులను సృష్టించారు. తద్వారా వచ్చిన మొత్తం అధికారిక రికార్డులకు చేరకుండా ఖాతాలు పక్కదారి పట్టించారు. ఫోరెన్సిక్ విశ్లేషణ, ఎన్‌హెచ్‌ఏఐ రికార్డులను సరిపోల్చడం ద్వారా ఈ ఘరానా మోసం నిజమేనని నిర్ధారణ అయింది.














Click it and Unblock the Notifications