మళ్ళీ విరుచుకుపడుతున్న ఎన్ఐఏ.. వాళ్ళే టార్గెట్; దక్షిణాది రాష్ట్రాల్లో 60చోట్ల దాడులు!!
దేశ వ్యాప్తంగా భారీ దాడులతో ఉగ్రవాద కార్యాకలపాలు సాగిస్తున్న సంస్థలపై చాలాకాలంగా ఎన్ఐఏ విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఉగ్రవాద మూలాలు ఉన్న సంస్థలపై, ఉగ్రవాదులకు సహకరించే సంస్థలపై, ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న అనుమానితులపై ఎన్ఐఏ ఉక్కుపాదం మోపుతోంది. ఇక తాజాగా మరోమారు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దక్షిణాది రాష్ట్రాలలో భారీ ఎత్తున సోదాలు జరుపుతోంది.

60 ప్రాంతాలలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు
నిషేధిత ఉగ్రవాద సంస్థ అయిన ఐ.ఎస్.ఐ.ఎస్ తో సంబంధాలు ఉన్న అనుమానితులపై భారీ అణిచివేతలో భాగంగా దేశంలోని కర్ణాటక, తమిళనాడు, కేరళలోని దాదాపు 60 ప్రాంతాలలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు జరుపుతున్నట్టు వర్గాలు తెలిపాయి. గత సంవత్సరం తమిళనాడులోని కోయంబత్తూర్, కర్ణాటకలోని మంగళూరులో జరిగిన పేలుళ్లకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు జరుపుతుంది.

కోయంబత్తూరు కారు బాంబు పేలుడు కేసు
కోయంబత్తూర్ లో జరిగిన కారు బాంబు పేలుడులో, 2019లో ఐఎస్ఐఎస్ సంబంధాలపై కేంద్ర ఉగ్రవాద నిరోధక సంస్థ దర్యాప్తు చేసిన జమేజా ముబిన్ మరణించిన విషయం తెలిసిందే. ముబిన్ రెండు సిలిండర్లు తెరిచి ఉన్న కారును నడుపుతున్న క్రమంలో పేలుడు సంభవించిందని, రెండు సిలిండర్లలో ఒకటి పేలిపోయిందని పోలీసులు తెలిపారు. ఆపై ముబీన్ ఇంట్లో తనిఖీలు జరపగా "తక్కువ-ఇంటెన్సివ్ పేలుడు పదార్థం" రికవరీ అయినట్టుగా పోలీసులు తెలిపారు. ఇక అవి భవిష్యత్తులో విధ్వంసం సృష్టించడం కోసం ఉద్దేశించబడినవిగా అనుమానించారు. అప్పుడే ఉగ్ర కుట్ర కేసును ఎన్ఐఏకు అప్పగించారు.

మంగుళూరులో ఆటో పేలుడు కేసు
నవంబర్ 19వ తేదీన మంగళూరులో జరిగిన ఆటో రిక్షా పేలుడులో ప్రధాని నిందితుడు సహా ఇద్దరు వ్యక్తులు గాయపడిన ఘటనకు సంబంధించిన కేసును కూడా ఎన్ఐఏ అధికారులు గత సంవత్సరం డిసెంబర్లో స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆటో రిక్షా పేలుడు ప్రమాదవశాత్తు జరిగింది కాదని, తీవ్ర నష్టం కలిగించాలని ఉద్దేశంతో జరిగిన ఉగ్రవాద చర్యని కర్ణాటక పోలీసులు పేర్కొన్నారు. ఇక ఈ కేసులపై దర్యాప్తు జరుపుతున్న ఎన్ఐఏ అధికారులు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను టార్గెట్ చేసి సోదాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం యాంటీ టెర్రర్ ఏజెన్సీ కర్ణాటకలోనూ 45కి పైగా చోట్ల దాడులు చేస్తోంది.












Click it and Unblock the Notifications