
గ్యాంగ్‌స్టర్లను వేటాడుతున్న ఎన్ఐఏ.. ఆ కీలక సమాచారంతో దేశవ్యాప్తంగా 20చోట్ల దాడులు!!
ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్ లకు మధ్య ఉన్న సంబంధాలను గుర్తించడం కోసం దేశవ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో గ్యాంగ్‌స్టర్ ల ఇళ్లలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు కొనసాగుతున్నాయి. గత కొంత కాలంగా గ్యాంగ్‌స్టర్ లకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని నిర్ధారణకు వచ్చిన ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే రెండుసార్లు ఈ నేపథ్యంలో తనిఖీలు చేసినట్లుగా తెలుస్తోంది. గ్యాంగ్‌స్టర్లు మరియు టెర్రర్ గ్రూపుల మధ్య సంబంధాలపై ఆగస్టు 26న దర్యాప్తు ప్రారంభించిన తర్వాత, ఎన్ఐఏ వరుస దాడులను కొనసాగిస్తుంది.
గ్యాంగ్‌స్టర్-టెర్రర్ ఫండ్స్ కేసులో దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఢిల్లీలోని ఎన్సిఆర్, రాజస్థాన్ హర్యానా మరియు పంజాబ్ లోని ఇరవై ప్రాంతాలపై ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్, నీరజ్ బవానా మరియు టిల్లు తాజ్‌పురియాతో సహా ఆరుగురు గ్యాంగ్‌స్టర్‌లను విచారించిన తర్వాత వారిచ్చిన సమాచారం మేరకు ఉగ్రవాద నిరోధక సంస్థ ఈ దాడులను కొనసాగిస్తున్నట్లు గా తెలుస్తుంది. ఈ ఆరుగురి విచారణలో పలు కీలక విషయాలు బయటకు వచ్చినట్టు సమాచారం. లారెన్స్ బిష్ణోయ్ తో పాటు విచారణ ఎదుర్కొంటున్న గ్యాంగ్‌స్టర్లు మరికొందరు గ్యాంగ్‌స్టర్ల పేర్లను చెప్పినట్టుగా వెల్లడించిన జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు మిగతా వారిని పట్టుకోవడం కోసం దాడులు కొనసాగిస్తున్నారని తెలుస్తుంది.

ఇక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రశ్నించిన గ్యాంగ్‌స్టర్ల ఇళ్లపైన కూడా దాడులు కొనసాగుతున్నాయి., వారికి సంబంధించిన ఇతర ప్రాంతాలపైనా, వారికి సహాయం అందించే వారి పైన కూడా ఎన్‌ఐఏ దాడులు నిర్వహిస్తోంది. విదేశాలలో గ్యాంగ్‌స్టర్ల కు ఉన్న పరిచయాలు, భారతదేశంలో ఉగ్రదాడులకు భారీగా నిధులు సమకూరుస్తూ, సహకరిస్తున్నారని గుర్తించిన అధికారులు దాడులు నిర్వహించి ఆరుగురిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. భారత్ లో ఉగ్రదాడులకు గ్యాంగ్‌స్టర్ లు చాప క్రింద నీరులా పని చేస్తున్నారని గుర్తించారు.
ఈ క్రమంలో తాజాగా విచారణలో ఉన్న గ్యాంగ్‌స్టర్లు పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులతో అనుబంధం కలిగి ఉన్నట్టు గుర్తించారు. ఉగ్రవాదులు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు గ్యాంగ్‌స్టర్లను ఏ విధంగా వాడుకుంటున్నారు అన్నదానిపై ఫోకస్ చేస్తున్న క్రమంలోనే ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇచ్చిన సమాచారం ప్రకారం, గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నిధుల కేసులో రెండు పర్యాయాలు దాడులు నిర్వహించారు. గతంలో ఉత్తర భారతదేశంలోని పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్, ఢిల్లీలో ఏకకాలంలో 50 చోట్ల దాడులు కొనసాగాయి. జాతీయ దర్యాప్తు సంస్థ విదేశాలలో ఉన్న ఉగ్రవాదులు , గ్యాంగ్‌స్టర్లు, డ్రగ్స్ స్మగ్లర్లు మరియు ట్రాఫికర్ల మధ్య ఉన్న సంబంధాల గుట్టు రట్టు చేసే పనిలో ఉంది. ఈ కేసుకు సంబంధించి అంతకు ముందు ఎన్‌ఐఏ దేశవ్యాప్తంగా 60 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది.