నిర్భయ దోషులకు ఉరి వాయిదా: కేంద్రం అసంతృప్తి, ‘చట్టంలో లొసుగులతో అపహాస్యం..’
న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష వాయిదాపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉండగా.. శుక్రవారం ఢిల్లీ పాటియాల హౌస్ కోర్టు శిక్షను నిలిపివేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది.

చట్టాన్ని అపహాస్యం చేసేలా
ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. చట్టాన్ని అపహాస్యం చేసేలా నిర్భయ దోషులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఉరిశిక్షను తప్పించుకునేందుకు చట్టంలోని లొసుగులను వాడుకుంటున్నారని.. గతంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. భారత చట్టాలపై పార్లమెంటు వేదికగా సుదీర్ఘమైన చర్చ జరగాలన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం దోషులుగా తేల్చినా.. శిక్ష అమలులో ఇంత ఆలస్యం జరగడంపై కిషన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా దోషులు ఉరిశిక్షను ఆలస్యం చేస్తూ.. చట్టాలను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.

కాలం చెల్లిన చట్టాల ప్రక్షాళన..
శిక్ష పడిన వెంటనే దాన్ని అమలు చేసేలా సుప్రీంకోర్టు ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించాలని కిషన్ రెడ్డి కోరారు. కాలం చెల్లిన సీఆర్పీసీ, ఐపీసీలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంటు సాక్షిగా ఆయా చట్టాలపై చర్చ జరగాలని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నిర్భయ దోషుల శిక్ష అమలు వాయిదా అంశంపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారిస్తోందని తెలిపారు.

ఉరి వాయిదా వేస్తూ కోర్టు..
నిర్భయ కేసులో పాటియాల హౌస్ కోర్టు సంచలన తీర్పు విధించింది. నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఉరిశిక్ష అమలు నిలిపివేయాలని స్పష్టం చేసింది. దోషలు తరపు న్యాయవాది కూడా ఈ మేరకు వెల్లడించారు. ఫిబ్రవరి 1న నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించడం లేదని న్యాయస్థానం చెప్పిందని తెలిపారు. కాగా, దోషులకు ఉరిశిక్ష అమలు వాయిదా పడటం ఇది మూడోసారి కావడం గమనార్హం. పాటియాల హౌస్ కోర్టు న్యాయమూర్తి తీర్పు నేపథ్యంలో నలుగురు దోషులు ముకేష్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తాలకు శనివారం ఉరిశిక్ష అమలు లేనట్లేనని తేలిపోయింది.












Click it and Unblock the Notifications