రాజీనామా ఉపసంహరణకు నో చాన్స్... బలనిరూపణే బెటర్
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన రాజీనామాను ఉపసంహరించుకోవడం కుదిరేపని కాదని, దానికంటే కూడా గవర్నర్ ఎదుట బలనిరూపణకు ప్రయత్నించడమే బెటరని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించి ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న పన్నీర్ సెల్వం తన రాజీనామాను ఉపసంహరించుకోవడం కుదిరేపని కాదని తెలుస్తోంది.
చట్ట ప్రకారం అలా చేయడం కుదరదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. తనకిష్టం లేకపోయినా శశికళ బలవంతంగా తన చేత రాజీనామా చేయించారని, తమిళనాడు ప్రజలు, అన్నాడీఎంకే శ్రేణులు కోరుకుంటూ తాను తన రాజీనామాను ఉపసంహరించుకుంటానని పన్నీర్ సెల్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ఏ పదవికి అయినా ఒకసారి రాజీనామా చేసిన తరువాత.. తిరిగి ఉపసంహరించుకోవడం కుదిరే పని కాదని, పైగా పన్నీర్ సెల్వం రాజీనామాకు గవర్నర్ ఆమోదముద్ర వేయడం కూడా ఇప్పటికే జరిగిపోయిందని, ఈ నేపథ్యంలో ఉపసంహరించుకోవడానికి చట్టంలో ఎలాంటి అవకాశం లేదన్నది న్యాయ నిపుణుల వాదన.
ఒకసారి రాజీనామా ఆమోదం పొందాక.. 'అర్రెర్రె.. ' అంటూ నాలుక్కరుచుకున్నా ప్రయోజనం ఉండదని, అన్నాడీఎంకే శ్రేణులు కోరుకున్నా, తమిళనాడు ప్రజలు కోరుకున్నా.. రాజీనామా ఉపసంహరణ అనేది సాధ్యం కాని విషయమని వారు తేల్చేస్తున్నారు.

ఇక ఈ అంశాన్ని పక్కన బెట్టి.. జరగబోయే కార్యక్రమంపై దృష్టిసారించాలని, గవర్నర్ ఎదుట బలనిరూపణకు అవసరమయ్యేంత సంఖ్యాబలాన్ని పెంచుకునే విషయంపై పన్నీర్ సెల్వం దృష్టి సారించడమే మంచిదని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.
ఈ విషయానికి సంబంధించి గతంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యానాలను వారు గుర్తు చేస్తున్నారు. అయితే హైకోర్టు ఇలాంటి ఆదేశాలను రాజకీయ సంబంధ కేసులో ఇవ్వనప్పటికీ.. సదరు వ్యాఖ్యలు రాజీనామా ఉపసంహరణ అంశానికి సంబంధించినవే.
రాజీనామా అనేది ఎలాంటి షరతులకు లోబడని చర్య అని, చట్ట ప్రకారం ఏ ఉద్యోగి రాజీనామా చేసిన తరువాత దానిని ఉపసంహరించుకునే వీలుండదని గతంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలే ఇప్పడు రాజకీయ రంగానికి ఆపాదిస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, అన్ని రంగాలకూ ఇదే వర్తిస్తుందని న్యాయ నిపుణులు పేర్కొంటన్నారు.












Click it and Unblock the Notifications