కరోనా సెకండ్ వేవ్: దేశీయ విమానాల్లో భోజన సేవలపై నిషేధం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ దూరం ప్రయాణించే విమానాల్లో భోజన సేవలను నిలిపివేసింది. ఏప్రిల్ 15 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది.
కరోనా మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో గత సంవత్సరం కేంద్రం దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మే 25 నుంచి దశల వారీగా ఈ సేవలను పునరుద్ధరించింది. అయితే, దేశీయ విమానాల్లో భోజన సేవలను అనుమతించలేదు.

ప్రయాణికులు సొంతంగా ఆహార పదార్థాలను కూడా తీసుకురావొద్దని పేర్కొంది. కరోనా కొంత తగ్గుముఖం పట్టడంతో ఆగస్టు 31 తర్వాత కొన్ని షరతులతో ఈ భోజన సదుపాయాలను మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. అయితే, గత కొద్ది వారాలుగా దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో భోజన సేవలపై పౌర విమానయాన శాఖ సోమవారం సమీక్ష నిర్వహించింది.
రెండు గంటల కంటే తక్కువ సమయం ప్రయాణించే విమానాల్లో భోజన సేవలపై నిషేధం విధించింది. దేశీయంగా విమాన సేవలు అందించే ఎయిర్‌లైన్స్ రెండు గంటలు అంతకంటే ఎక్కువ సమయం ప్రయాణించే విమానాల్లో మాత్రమే భోజన సేవలను అందించాలని కేంద్ర విమానయాన శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
కాగా, గత కొద్ది రోజులుగా మన దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
కరోనా కేసుల సంఖ్యలో ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్న భారత్... ఇప్పుడు రెండో స్థానానికి చేరింది. మొత్తం 13.53(1.35కోట్లు) మిలియన్ల కరోనా కేసులతో బ్రెజిల్‌ను వెనక్కి నెట్టేసింది. బ్రెజిల్‌లో ఇప్పటివరకూ 13.45 మిలియన్ల కరోనా కేసులు నమోదవగా.. మొదటి స్థానంలో ఉన్న అమెరికాలో 31.2మిలియన్ల కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 1,68,912 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 904 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటివరకూ కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1,70,179కి చేరింది.












Click it and Unblock the Notifications