కోడలి వేధింపులు భరించలేక కుటుంబం ఆత్మహత్య
రాంచీ: అత్తారింటి వేధింపులు భరించలేక కోడలు ఆత్మహత్య అనే వార్తలు ఇప్పటి వరకు ఏదో ఓ సందర్భంలో చదవే ఉంటాం. కానీ, ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. కోడలి వేధింపులు తట్టుకోలేక అత్తింటి కుటుంబంలోని ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు ఓ ఆర్మీ డాక్టర్ ఆరోపించారు. కాగా, ఈ ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ అపార్ట్ మెంట్‍లో చోటు చేసుకుంది.
ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తాజాగా తెలిపిన వివరాల ప్రకారం.. నోయిడాకు చెందిన సుకాంత సర్కార్ ఆర్మీ వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. గత ఆదివారం ఆయన కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు.
సమాచారమందుకున్న పోలీసులు అపార్ట్‌మెంట్‌కు చేరుకోగా.. అక్కడ సర్కార్ భార్య అంజన, కుమారుడు సమీర్, మనవరాళ్లు సమీత, సుమిత, మరో కోడలు మౌమిత చనిపోయి కన్పించారు. సర్కార్ తీవ్ర గాయాలతో ఉన్నారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్‌లు, కొన్ని మందులు, సూదులు లభించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు సర్కార్‌ను విచారించారు.

తన కుమారుడు సమీర్ భార్య వేధింపులు తట్టుకోలేకే తమ కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుందని సర్కార్ పోలీసులకు తెలిపాడు. మనవరాళ్లు సహా.. తన భార్య, కొడుకు, మరో కోడలు అధికమొత్తంలో నిద్ర మాత్రలు తీసుకుని చనిపోయారని చెప్పాడు.
తాను కూడా కత్తితో పొడుచుకుని చనిపోదామని ప్రయత్నించగా.. దురదృష్టవశాత్తు బతికానని సర్కార్ పోలీసులకు తెలిపాడు. తమ కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెడతానని కోడలు బెదిరించిందని, అందుకు స్థానిక స్వచ్ఛంద సంస్థ కూడా ఆమెకు మద్దతిచ్చిందని సర్కార్ ఆరోపించాడు. దీంతో మనస్తాపం చెంది తాము ఆత్మహత్యకు యత్నించామని పేర్కొన్నాడు.
ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఐదుగురి మృతదేహాలను ఆస్పత్రికి తరలించామని, వారి పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే అసలు విషయం తెలుస్తుందని వివరించారు.












Click it and Unblock the Notifications