మహిళ తల, చేతులు నరికిన ప్రియుడు: కాలి మెట్టెతో హంతకుడి అరెస్ట్!
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో నవంబర్ 6న ఒక కాలువలో లభించిన శిరస్సు, చేతులు లేని, దుస్తులు లేని గుర్తు తెలియని మృతదేహం కేసును పోలీసులు కేవలం 10 రోజుల్లో చేదించారు. ముఖం, వేలిముద్రల ద్వారా గుర్తుపట్టకుండా ఉండటానికి హంతకుడు ఎంత ప్రయత్నించినా.. ఆ మృతదేహం కాలికి ఉన్న మెట్టెల ఆధారంగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.
వివాహేతర సంబంధం.. బ్లాక్ మెయిల్
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతి చెందిన మహిళ పేరు ప్రీతి యాదవ్. ఈమె జీన్స్ తయారీ కర్మాగారంలో పనిచేసేది. నిందితుడు మోను యాదవ్ బస్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. మోను తల్లి పనిచేసే చోటే ప్రీతి కూడా పనిచేయడంతో బరోలా ప్రాంతంలో పక్కపక్కనే నివసించే వీరిద్దరూ దగ్గరయ్యారు. క్రమంగా వీరి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ప్రీతికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలం తర్వాత ఆమె మోను సింగ్‌ను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. "ఆమె మోను నుంచి డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. అబద్ధపు కేసుల్లో ఇరికిస్తానని, అలాగే మోను ఇద్దరు కూతుళ్లను కూడా అక్రమ వృత్తిలోకి నెట్టేస్తానని బెదిరించింది" అని పోలీసులు వెల్లడించారు. ఈ బెదిరింపులతో విసిగిపోయిన మోను ప్రీతిని చంపడానికి ప్లాన్ వేశాడు.

హత్య జరిగిన తీరు ఇలా..
నవంబర్ 5న మోను సింగ్ చేపలు నరికేందుకు ఉపయోగించే పదునైన కత్తిని తీసుకుని తన ఏసీ బస్సులోకి ప్రీతిని ఆహ్వానించాడు. బస్సు అద్దాలు చీకటిగా ఉండటంతో లోపల ఏం జరుగుతుందో బయటి వారికి తెలియదు. ఒక దాబా వద్ద ఆగి ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవ తీవ్రం కావడంతో మోను తన ఆయుధంతో ప్రీతిపై దాడి చేశాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మోను.. ప్రీతిని హత్య చేసి, ఆమెను ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు తల, చేతులను నరికేశాడు. ఆ తర్వాత ఆమె దుస్తులు తీసి మృతదేహాన్ని కాలువలో పడేశాడు. మిగిలిన శరీర భాగాలు, వెంట్రుకలు, ఆయుధాన్ని ఘజియాబాద్‌లోని సిద్ధార్థ్ విహార్ సమీపంలో ఉన్న ఒక కాలువలో పడేశాడు.
మెట్టెలతో నేరస్థుడిని పట్టుకున్న పోలీసులు
తల, చేతులు లేకపోవడంతో మృతదేహం గుర్తుపట్టడం పోలీసులకు అసాధ్యమైంది. అయినప్పటికీ మృతదేహం కాలికి ఉన్న మెట్టెలు పోలీసులకు ఏకైక ఆధారంగా నిలిచాయి. పోలీసులు 5,000 కంటే ఎక్కువ సీసీటీవీ కెమెరాలను స్కాన్ చేశారు. 1,100 వాహనాలను తనిఖీ చేశారు. వాటిలో అనుమానాస్పదంగా ఉన్న 44 వాహనాలను షార్ట్‌లిస్ట్ చేశారు.
నవంబర్ 5న నేరం జరిగిన ప్రదేశం దగ్గర లైట్లు ఆర్పివేసి అనుమానాస్పదంగా తిరుగుతున్న తెలుపు-నీలం రంగు బస్సును పోలీసులు గుర్తించారు. ఆ బస్సు రిజిస్ట్రేషన్ నంబర్ (UP16 KT 0037) ఆధారంగా అది మోను సింగ్‌దిగా నిర్ధారించారు. బస్సును తనిఖీ చేయగా, ఫోరెన్సిక్ పరీక్షలో బస్సులో స్వాధీనం చేసుకున్న వస్తువులలో మానవ రక్తం ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో మోను సింగ్‌ను అరెస్టు చేయగా, అతను నేరాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై మరింత దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications