టూర్: మోడీయే కాదు, రాహుల్ కూడా అమెరికాలోనే
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నుంచి ఆరు రోజుల అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా అమెరికా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆస్పెన్‌లో జరగనున్న సమావేశాల్లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ అమెరికా వెళ్లారని కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారని ఆయన తెలిపారు.

రాహుల్ గాంధీ పర్యటనపై ప్రచారంలో ఉన్న ఊహాగానాలను కొట్టిపారేస్తూ సూర్జేవాలా ఈ వివరాలను వెల్లడించారు. అయితే సమావేశానికి సంబంధించిన వివరాలు కానీ, రాహుల్ పర్యటన ఎన్నిరోజులనే విషయాన్ని కానీ ఆయన స్పష్టం చేయలేదు.
కాగా, మంగళవారం మధ్యాహ్నం ఇదే అంశంపై మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ వ్యక్తిగత పనిపై విదేశాలకు వెళ్లారని, త్వరలో తిరిగి వచ్చి బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆయనే చెప్పడం గమనార్హం.
ఏఐసీసీ మీడియా సమావేశం సందర్భంగా రాహుల్ లండన్ వెళ్లారా? అంటూ ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నకు.. సూర్జేవాలా పైవిధంగా సమాధానమిచ్చారు.












Click it and Unblock the Notifications