ఆగని నుపుర్ వ్యాఖ్యల చిచ్చు-మరిన్ని దేశాల ఖండనలు-కేంద్రం నష్టనివారణ చర్యలు
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ముస్లిం దేశాల్లో ఆగ్రహం వ్యక్తమవుతూనే ఉంది. ఇప్పటికే గల్ప్ దేశాలతో పాటు పాకిస్తాన్ కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఇప్పుడు అదే జాబితాలో మరికొన్ని దేశాలు కూడా చేరుతున్నాయి.
నుపుర్ శర్మ వ్యాఖ్యలపై తాజాగా నిరసన తెలిపిన దేశాల జాబితాలో యూఏఈ, జోర్డాన్, ఇండోనేషియా చేరాయి. దీంతో భారత్ పై దౌత్యపరమైన దాడి కొనసాగుతున్నట్లయింది. నిన్న యూఏఈ విదేశీ వ్యవహారాలు, అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖ (MoFAIC) నైతిక, మానవీయ విలువలు, సూత్రాలకు విరుద్ధమైన అన్ని వ్యాఖ్యల్ని గట్టిగా తిరస్కరించినట్లు ప్రకటించింది. మతపరమైన చిహ్నాలను గౌరవించాలని, వాటిని ఉల్లంఘించకూడదని, అలాగే ద్వేషపూరిత ప్రసంగం, హింసను ఎదుర్కోవాల్సిన అవసరాన్ని యూఏఈ గుర్తుచేసింది. వివిధ మతాల అనుచరుల మనోభావాలను రెచ్చగొట్టే ఎలాంటి వ్యాఖ్యల్ని అయినా నిరోధించడంతోపాటు సహనం, మానవ సహజీవనం యొక్క విలువలను వ్యాప్తి చేయడానికి అంతర్జాతీయ బాధ్యతను బలోపేతం చేయాల్సిన అవసరమాన్ని కూడా గుర్తుచేసింది.

నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యల్ని జోర్డాన్ రాజ్యం కూడా ఖండించింది. జోర్డాన్ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హైతం అబూ అల్ఫౌల్ జోర్డాన్ ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలను ఖండిస్తున్నట్లు ప్రకటించారు. ఇస్లామిక్, ఇతర మతపరమైన వ్యక్తులపై ఉల్లంఘనలను గట్టిగా తిరస్కరించాలని కోరారు. ప్రవక్త ముహమ్మద్‌పై ఇద్దరు భారతీయ రాజకీయ నాయకులు చేసిన "ఆమోదించలేని అవమానకరమైన వ్యాఖ్యల"పై ఇండోనేషియా కూడా తన తీవ్ర ఖండనను వ్యక్తం చేసింది.
సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఒమన్, అలాగే పర్షియన్ గల్ఫ్‌లోని ఇరాన్ వంటి గల్ఫ్ దేశాలు నుపుర్ శర్మ వ్యాఖ్యలను ఖండించడంతో బిజెపి నేతృత్వంలోని కేంద్రం ఇప్పటికే నష్టనివారణ చర్యలు చేపడుతోంది. ఖతార్, కువైట్ కూడా భారతదేశం నుండి బహిరంగ క్షమాపణను ఆశిస్తున్నామని చెప్పాయి. దీంతో భారత్ ఈ వ్యాఖ్యలు భారత ప్రభుత్వ అభిప్రాయాన్ని ప్రతిబింబించబోవని ప్రకటించింది. అదే సమయంలో సీనియర్ దౌత్యవేత్తల్ని రంగంలోకి దింపి ఇలాంటి చర్యల్ని,వ్యాఖ్యల్ని ప్రోత్సహించబోమన్న సంకేతాలు ఇస్తోంది.












Click it and Unblock the Notifications