వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నూపుర్ శర్మ వివాదం: భారత్, అరబ్ దేశాల సంబంధాలపై ఎలాంటి ప్రభావం పడనుంది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
భారత్‌కు సౌదీ అరేబియాతో సత్సంబంధాలు ఉన్నాయి

మహమ్మద్ ప్రవక్తపై బీజేపీకి చెందిన ఇద్దరు సభ్యులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆగ్రహం పెల్లుబకడంతో భారతదేశం, ఇస్లామిక్ ప్రపంచంలోని తమ భాగస్వామ్య దేశాలను శాంతింప చేయాల్సి వచ్చింది.

బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ ఒక టీవీ చర్చలో ఈ వ్యాఖ్యలు చేయగా, దిల్లీ బీజేపీ విభాగానికి చెందిన నవీన్ కుమార్ జిందాల్ ఈ అంశంపై ఒక ట్వీట్‌ చేశారు.

నూపుర్ శర్మ వ్యాఖ్యలు దేశంలోని ముస్లిం సమాజానికి కోపం తెప్పించాయి. కొన్ని రాష్ట్రాల్లో అక్కడక్కడ నిరసనలకు కారణమయ్యాయి.

నూపుర్ శర్మ వ్యాఖ్యలు అభ్యంతరకర రీతిలో ఉన్నందున బీబీసీ వాటిని ఇక్కడ మళ్లీ చెప్పడం లేదు.

ఈ వివాదానికి కారణమైన బీజేపీనేతలిద్దరూ బహిరంగ క్షమాపణలు చెప్పారు. వారిని బీజేపీ సస్పెండ్ చేసింది.

"ఏ మతాన్నీ, వర్గాన్ని అవమానించే, కించపరిచే భావజాలానికి బీజేపీ వ్యతిరేకం. అలాంటి వ్యక్తులను బీజేపీ ప్రోత్సహించదు" అని పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది.

కానీ, దేశ అంతర్గత విషయం కాస్తా అంతర్జాతీయ స్థాయిలో దుమారంగా మారడంతో బీజేపీ తీసుకున్న తాజా చర్యలు సరిపోవని నిపుణులు అంటున్నారు.

కువైట్, ఖతర్, ఇరాన్ దేశాలు ఆదివారం తమ నిరసనను తెలపడానికి భారత రాయబారులను పిలిచాయి. ఈ వివాదాస్పద వ్యాఖ్యలను సౌదీ అరేబియా కూడా సోమవారం ఖండించింది.

భారత్ నుంచి బహిరంగ క్షమాపణను ఆశిస్తున్నామని ఖతర్ పేర్కొంది.

''ఎలాంటి శిక్ష విధించకుండా ఇలాంటి ఇస్లామోఫోబిక్ వ్యాఖ్యలను అనుమతిస్తే మానవ హక్కుల పరిరక్షణకు తీవ్ర ప్రమాదం కలుగుతుంది. ఇది హింస, ద్వేషం వంటి వాటిని ప్రోత్సహించే మత దురభిమానానికి దారి తీయవచ్చు'' అని ఖతర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది.

సౌదీ అరేబియా కూడా దీనిపై ఒక ప్రకటనను విడుదల చేసింది. ''బీజేపీ ప్రతినిధులు ముహమ్మద్ ప్రవక్తను అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఇస్లాం మత చిహ్నాలకు వ్యతిరేక చర్యలను ఎప్పుడూ తిరిస్కరిస్తాం. ఇస్లాంతో పాటు ఏ మతానికి చెందిన వ్యక్తులు, చిహ్నాల పట్ల పక్షపాతాన్ని సహించమని'' పునరుద్ఘాటించింది.

పట్టించుకోవాల్సిన అవసరం లేని వ్యక్తులు (ఫ్రింజ్ ఎలిమెంట్స్) చేసిన ఆ వ్యాఖ్యలు, ఏ విధంగా కూడా భారత ప్రభుత్వ అభిప్రాయాలకు, ఆలోచనలకు అద్దం పట్టవని ఖతర్‌లో భారత రాయబారి దీపక్ మిత్తల్ అన్నారు.

ఆ వివాదాస్పద వ్యాఖ్యలను బీజేపీ సీనియర్ నాయకులు, ఇతర రాయబారులు ఖండించారు.

అయితే పార్టీ అగ్రనాయకత్వం, ప్రభుత్వం ఈ విషయంపై బహిరంగ ప్రకటన చేయాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అలా చేయకపోతే ఈ దేశాలతో భారత్ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

చాలా ప్రమాదం

2020-21లో గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ)తో భారత వాణిజ్యం 87 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 6,75, 580 కోట్లు)గా ఉంది. ఈ జీసీసీలో కువైట్, ఖతర్, సౌదీ అరేబియా, ఒమన్, యూఏఈ ఉంటాయి.

లక్షలాది మంది భారతీయులు ఈ దేశాల్లో పని చేస్తూ కోట్ల రూపాయలు స్వదేశానికి పంపుతారు. ఈ ప్రాంతం నుంచే భారత్ అధికంగా ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుంది.

2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఈ రీజియన్‌లో తరచుగా పర్యటిస్తున్నారు. భారతదేశం ఇప్పటికే యూఏఈతో స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందంపై సంతకం చేసింది. మరింత విస్తృత ఒప్పందాల కోసం జీసీసీతో చర్చలు జరుపుతోంది.

అబుదాబిలో మొదటి హిందూ దేవాలయ శంకుస్థాపన 2018లో జరిగింది. ఈ కార్యక్రమానికి భారత్ నుంచి మోదీ హాజరయ్యారు. అప్పట్లో దీన్ని భారత్‌తో ఈ రీజియన్‌కు పెరుగుతోన్న సంబంధాలకు ఉదాహరణగా చూశారు.

గత కొన్నేళ్లుగా టెహ్రాన్‌, దిల్లీ మధ్య సంబంధాలు ఓ మోస్తరుగానే ఉన్నాయి. అయితే తాజా వివాదం ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దొల్లాహియాన్ భారత పర్యటనను ప్రభావితం చేస్తుందని అంచనా వేస్తున్నారు.

భారత్ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అరబ్ దేశాల్లో భారత్‌కు రాయబారిగా పనిచేసిన అనిల్ త్రిగుణాయత్ అన్నారు. దేశ అగ్ర నాయకత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తే మాత్రమే ఈ కఠిన పరిస్థితుల నుంచి భారత్ తప్పించుకోగలదని ఆయన అభిప్రాయపడ్డారు.

"చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటేనే ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయి. ఇటువంటి అంశాలు, సామాజిక గందరగోళాన్ని సృష్టించి దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తాయి'' అని ఆయన అన్నారు.

ఈ రీజియన్‌లో భారతదేశ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఇతర విశ్లేషకులు అంటున్నారు.

"విదేశాలతో పాటు మిత్ర దేశాలేవైనా... భారతదేశ అంతర్గత విషయాలను విమర్శించినప్పుడు భారత అధికారులు రక్షణాత్మకంగా స్పందిస్తారు. అయితే ఈ కేసులో మాత్రం, క్షమాపణలు చెప్పడం లేదా ఇతర మార్గాల ద్వారా భారత దౌత్యవేత్తలే ఈ ఉద్రిక్తతలను త్వరగా తగ్గించడానికి పనిచేస్తారని ఆశిస్తున్నా' అని విల్సన్ సెంటర్ థింక్ టాంక్‌లో ఆసియా ప్రోగ్రామ్ డిప్యూటీ డైరెక్టర్ మైఖేల్ కుగెల్‌మన్ అన్నారు.

అరబ్ దేశాలు కూడా తమ ప్రజల్లో ఉన్న కోపాన్ని చల్లార్చడానికి గట్టి చర్య తీసుకోవాలని చూస్తున్నాయి. ఈ దేశాల్లో భారత్‌ను విమర్శించే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. వారి మీడియా సంస్థల్లో కూడా ఈ అంశానికి సంబంధించిన ఈ వార్తలే టాప్‌లో ఉంటున్నాయి.

భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలంటూ కొన్ని హ్యాష్‌ట్యాగ్‌లు పిలుపునిచ్చాయి. ఖతర్, కువైట్‌లోని కొన్ని దుకాణాలు భారతీయ ఉత్పత్తులను తొలిగించినట్లు కూడా నివేదికలు వచ్చాయి.

భారత్‌తో సత్సంబంధాలు జీసీసీకి కూడా ప్రాధాన్యతతో కూడిన అంశమని, ఈ అంశంలోని ప్రమాదాన్ని నివారించడానికి ఇరు పక్షాలు దృష్టి సారిస్తాయని కుగెల్‌మన్ చెప్పారు.

''ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా గల్ఫ్ దేశాలు, భారత్‌కు ఇంధనాన్ని ఎగుమతి చేయాలని కోరుకుంటాయి. భారతీయలు అక్కడ పనిచేయాలని అనుకుంటాయి. భారత్‌తో వ్యాపారాన్ని కొనసాగించడం వారికి అవసరం'' అని ఆయన వివరించారు.

గల్ఫ్ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు పని చేస్తారు

పెరుగుతున్న విభజన

2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతదేశంలో మతపరమైన విభజన పెరిగిందని విమర్శకులు అంటున్నారు. వందల ఏళ్ల నాటి మసీదులో ప్రార్థనలు చేసేందుకు అనుమతించాలని కోరుతూ కొన్ని హిందూ సంఘాలు వారణాసిలోని స్థానిక కోర్టును ఆశ్రయించడంతో గత కొన్ని వారాలుగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కూల్చివేసిన ఆలయ శిథిలాల మీద మసీదును నిర్మించారని వారు పేర్కొన్నారు.

టీవీ చానెళ్లు దీనిపై చర్చలు నిర్వహించాయి. సోషల్ మీడియాలో కూడా దీనిపై ద్వేషపూరిత వ్యాఖ్యలు వచ్చాయి. మితవాద సంస్థలతో సంబంధం ఉన్న చాలా మంది వ్యక్తులు తరచుగా టీవీ షోలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే విమర్శకులు మాత్రం... బీజేపీ పేర్కొన్నట్లుగా నూపుర్ శర్మ ఒక ఫ్రింజ్ ఎలిమెంట్ కాదని, ఆమె బీజేపీ అభిప్రాయాలకు ప్రాతినిధ్యం వహించే పార్టీ అధికార ప్రతినిధి అని అంటున్నారు.

ఈ వివాదం, భారతదేశానికి మేల్కొలుపు చర్య అని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Nupur Sharma controversy: How much impact will it have on Indo Arab relation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X