జమిలి ఎన్నికల వెనుక భారీ ప్లాన్! 5 రాష్ట్రాల ఎన్నికల వాయిదా ? ప్రశాంత్ భూషణ్ వెల్లడి..
కేంద్రం ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే దేశం-ఒకే ఎన్నికల పేరుతో జపం చేస్తోంది. జమిలి ఎన్నికల నిర్వహణ ద్వారా భారీ ఎత్తున వ్యయం, సమయం ఆదా అవుతుందని నమ్మబలుకుతోంది. కానీ ఈ ప్లాన్ వెనుక అంతకుమించిన భారీ వ్యూహం దాగి ఉందనే ప్రచారం జాతీయ స్ధాయిలో జరుగుతోంది. తాజాగా ఇదే అంశంపై సుప్రీంకోర్టులో ప్రఖ్యాత లాయర్ ప్రశాంత్ భూషణ్ కీలక వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది చివర్లో జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నికలను వాయిదా వేసేందుకే ఈ కుట్ర జరుగుతోందని ఆయన ఇవాళ ఆరోపించారు.
ఈ ఏడాది చివర్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఐదు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. అలాగని ఈ ఎన్నికలు నిర్వహించి ఓడిపోతే ఈ ప్రభావం వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలపై పడటం ఖాయం. దీంతో ఎలాగైనా ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్ని వచ్చే ఏడాదికి వాయిదా వేసి దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని సుప్రీం న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వెల్లడించారు.

భారత్ వంటి ప్రజాస్వామ్య దేశంలో మధ్యలో ఓ ప్రభుత్వం మెజార్టీ కోల్పోతే కుప్పకూలుతుందని, అటువంటప్పుడు జమిలి ఎన్నికల నిర్వహణ వల్ల ఎలాంటి లాభం ఉండబోదని ప్రశాంత్ భూషణ్ వెల్లడించారు. అలాగే జమిలి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు రాష్ట్రపతి పాలన విధించాల్సి ఉంటుందని, అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని ఆయన వ్యాఖ్యానించారు. అదే జరిగితే మనం ప్రజాస్వామ్యం నుంచి అధ్యక్ష తరహా పాలన వైపు మళ్లాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం కేంద్రం పార్లమెంటులో చట్ట సవరణకు సిద్ధమవుతోందన్నారు.
రాజ్యసభలో ప్రస్తుత ప్రభుత్వానికి మెజారిటీ లేదని, ఆ విషయం తెలిసీ జమిలి ఎన్నికల వ్యూహానికి తెరలేపుతోందని ప్రశాంత్ భూషణ్ విమర్శించారు. ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోబోతోందని తేలిపోయిందని, అందుకే అక్కడ ఎన్నికలు వాయిదా వేసి ఏకంగా సార్వత్రిక ఎన్నికలతో కలిపేసి జమిలి ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఉందన్నారు. ఆయా రాష్ట్రాల్లో అప్పటివరకూ రాష్ట్రపతి పాలన విధిస్తారని ప్రశాంత్ భూషణ్ జోస్యం చెప్పారు.












Click it and Unblock the Notifications