Operation Sindoor: స్కూల్లో పాఠ్యాంశంగా ఆపరేషన్ సింధూర్..! ఉత్కంఠ..!
కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడికి కౌంటర్ గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. ఈ ఆపరేషన్ కారణంగా పాకిస్తాన్ దారికొచ్చి కాల్పుల విరమణ కోరింది. దీంతో భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ అనుకున్న ఫలితాలను రాబట్టింది. ఈ నేపథ్యంలో భవిష్యత్ తరాలు దీన్ని గుర్తుంచుకునేందుకు వీలుగా ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల్లో దీన్నో పాఠంగా రూపొందిస్తోంది. ఆపరేషన్ సింధూర్ లో భారత్ ఎలా విజయం సాధించిందన్న దానిపై ఇందులో వివరిస్తారు.
పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ముందుగా పాకిస్తాన్ తో పాటు ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర శిబిరాలపై ముందుగా మన సైన్యం దాడులు చేసింది. దీంతో పాకిస్తాన్ ప్రతిదాడులకు దిగింది. వీటిని అడ్డుకునేందుకు నాలుగు రోజుల పాటు పూర్తి స్ధాయిలో భారత్ యుద్ధం చేసింది. లాహోర్, ఇస్లామాబాద్ లతో పాటు పలు నగరాల్లో ఆయుధ రక్షణ వ్యవస్థలపై దాడులు చేసి కుప్పుకూల్చింది. దీంతో పాకిస్తాన్ అమెరికా సాయం కోరడం, ట్రంప్ సూచనతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించడం జరిగిపోయాయి.

ఈ నేపథ్యంలో ఎన్సీఈఆర్టీ భారత్ సాధించిన ఈ విజయాన్ని భవిష్యత్ తరాలు తెలుసుకునేందుకు వీలుగా పాఠ్య పుస్తకాల్లో చేరుస్తోంది.ఇందుకోసం నిపుణులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ మేరకు ఆదేశాలు రావడంతో వారు పాఠ్యాంశాన్ని తయారు చేస్తున్నారు. ఇందులో ఆపరేషన్ సింధూర్ ను ఓ కేస్ స్టడీగా చూపించబోతున్నారు. తొలుత హైస్కూల్ సిలబస్ లో, ఆ తర్వాత చిన్న తరగతుల సిలబస్ లోనూ దీన్ని దశల వారీగా చేరుస్తారు.
జాతీయ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్సీఎఫ్), జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) కింద ఎన్సీఈఆర్టీ కొత్త పాఠ్య పుస్తకాలు విడుదల చేయబోతోంది. ఇందులో భాగంగా 6, 8 తరగతులకు ఇంగ్లీష్, సోషల్, సంస్కృతంతో పాటు కౌశల్ బోధ్ పేరుతో వృత్తి విద్య పుస్తకాల్ని ఇప్పటికే విడుదల చేశారు. ఈ పుస్తకాల్లో భారత సంస్కృతితో పాటు ఆధునిక సవాళ్లపైనా అధ్యాయాలు ఉన్నాయి. ఇప్పుడు రాబోయే పుస్తకాల్లో ఎన్సీఈఆర్టీ ఈ ఆపరేషన్ సింధూర్ ను చేర్చబోతోంది.












Click it and Unblock the Notifications