బ్రిటన్ నుంచి 6 వేల మందికి పైగా రాక- తెలుగు రాష్ట్రాల్లో 1268 మంది- కొత్త వైరస్ ముప్పు
బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ ముప్పు మొదలైన నేపథ్యంలో అక్కడి నుంచి గత నెల రోజుల వ్యవధిలో భారత్ వచ్చిన ప్రయాణికులను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సాయంతో తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 వరకూ బ్రిటన్ నుంచి ఆరు వేల మందికి పైగా ప్రయాణికులు వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సమాచారం ఇచ్చాయి. దీంతో వీరి జాడ గుర్తించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరందరినీ గుర్తిస్తేనే భారత్‌కు కొత్త వైరస్ ముప్పు తప్పినట్లనవుతుందని కేంద్రం చెబుతోంది.

బ్రిటన్ నుంచి వైరస్ భారత్ చేరిందా ?
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ముప్పు తప్పిందని భావిస్తున్న తరుణంలో బ్రిటన్‌లో మొదలైన కొత్త రకం కరోనాను పోలిన వైరస్ ఇప్పుడు అన్ని దేశాలను కుదిపేస్తోంది. ముఖ్యంగా బ్రిటన్ నుంచి రాకపోకలు ఎక్కువగా సాగే భారత్ వంటి దేశాలు ఈ కొత్త వైరస్‌ను తలచుకుని వణికిపోతున్నాయి. ఇప్పటికే గతేడాది చివర్లో మొదలైన కరోనా వైరస్ ప్రభావంతో ఆర్ధిక వ్యవస్ధలు కుదేలు కావడంతో పాటు వ్యక్తిగత జీవితాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీంతో బ్రిటన్ నుంచి వస్తున్న ఈ కొత్త వైరస్ ముప్పు భారత్‌కు చేరిందనే అనుమానాలను కేంద్రం వ్యక్తం చేస్తోంది. అందుకే నెల రోజుల పాటు బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికులను గుర్తించే పనిలో పడింది.

ఆరు వేల మందికి పైగా వచ్చినట్లు గుర్తింపు
కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాల ప్రకారం నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకూ బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికులను గుర్తించే పనిలో రాష్ట్రాలు బిజీగా ఉన్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రాలు కేంద్రానికి ఇచ్చిన సమాచారం మేరకు ఆరువేల మందికి పైగా ప్రయాణికులు ఈ సమయంలో బ్రిటన్ నుంచి భారత్ వచ్చినట్లు తేల్చారు. దీంతో ఈ ఆరు వేల మందిని తక్షణం గుర్తించి శాంపిల్స్ సేకరించాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. ఇందులో విఫలమైతే ఇబ్బందులు తప్పవని హెచ్చరికలు చేస్తోంది. దీంతో ఇప్పుడు పలు రాష్ట్రాలు వీరిని గుర్తించి శాంపిల్స్ సేకరించి, ల్యాబ్‌లకు పంపుతున్నాయి.

పలు రాష్ట్రాల్లో బ్రిటన్ ప్రయాణికుల గుర్తింపు..
తమిళనాడులో బ్రిటన్ నుంచి వచ్చిన 2724 మంది ప్రయాణికులు వివిధ మార్గాల్లో వచ్చినట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరిలో 996 మంది ఆచూకీ దొరికిందని, మిగతా వారి కోసం వెదుకుతున్నట్లు తమిళనాడు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ 996 మందిలో 516 మంది శాంపిల్స్ పరీక్షలకు పంపగా.. వీటిలో 203 నెగెటివ్‌గా రావడం ఊరటనిస్తోంది. మరోవైపు కేరళలోనూ బ్రిటన్ నుంచి 2116 మంది వచ్చినట్లు గుర్తించారు. వీరిలో 1609 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించి 14 రోజుల క్వారంటైన్‌లో ఉంచారు. అలాగే కర్నాటకలో 2127 మంది బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికులను గుర్తించారు. వీరిలో 1016 మంది పరీక్షలు నిర్వహించారు. వీరికి మాత్రం హోం ఐసోలేషన్‌కు అనుమతి ఇవ్వడం లేదు.

తెలుగు రాష్ట్రాల్లోనూ బ్రిటన్ ప్రయాణికులు..
బ్రిటన్ నుంచి తెలుగు రాష్ట్రాలకూ భారీగా ప్రయాణికులు వచ్చినట్లు గుర్తించారు. ఇందులో తెలంగాణకు 1200 మంది, ఏపీకి 68 మంది ప్రయాణికులు వచ్చినట్లు తేలింది. వీరి శాంపిల్స్ సీసీఎంబీకి పంపారు. తెలంగాణకు వచ్చిన వారిలో ఇప్పటివరకూ ఏడుగురికి పాజిటివ్‌గా తేలింది. అలాగే ఏపీకి బ్రిటన్ నుంచి వచ్చిన 68 మందిలో 38 మంది చిత్తూరు జిల్లాకే వచ్చినట్లు గుర్తించారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నలుగురు, మచిలీపట్నానికి ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో మరో ఆరుగురూ వచ్చినట్లు చెబుతున్నారు. రాజమండ్రికి వచ్చిన ఓ మహిళను గుర్తించి శాంపిల్స్ సేకరించారు. వీటిని పూణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు.












Click it and Unblock the Notifications