parliament monsoon session day13:వ్యక్తిగత గోప్యత బిల్లు వెనక్కి-డోపింగ్ బిల్లుకు ఆమోదం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల 13వ రోజు ఉభయసభల్లోనూ పలు కీలక బిల్లులు ముందడుగు వేశాయి. వీటిలో కొన్ని బిల్లుల్ని విపక్షాల నిరసనల మధ్యే కేంద్రం ఆమోదించుకుంది.అలాగే మరో కీలక బిల్లును ఉపసంహరించుకుంది. విపక్షాల్ని కేంద్రం ఈడీ సాయంతో టార్గెట్ చేయడాన్ని నిరసిస్తూ లోక్ సభలో విపక్షాలు తీవ్రంగా ఆందోళనలు చేశాయి.
లోక్ సభ ఇవాళ కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. అలాగే 2019లో తెచ్చిన వ్యక్తిగత గోప్యత పరిరక్షణ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకుంది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల (సవరణ) బిల్లు, 2022ను లోక్‌సభ మూజువాణి ఓటు ద్వారా ఆమోదించింది. వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు 2019ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఉపసంహరించుకున్నారు. ఇవాళ లోక్ సభలో కేంద్రం ఇంధన సంరక్షణ (సవరణ) బిల్లు 2022ని కూడా ప్రవేశపెట్టింది.

మధ్యాహ్న భోజన విరామం తర్వాత రాజ్యసభలో జాతీయ డోపింగ్ నిరోధక బిల్లు, 2022పై చర్చను ప్రారంభించింది. చర్చ సందర్భంగా అధికార పార్టీతో పాటు విపక్ష ఎంపీలు కూడా బిల్లుకు తమ మద్దతును తెలిపారు. అయితే దాని లోపాల గురించి కూడా సూచనలు చేశారు. సుదీర్ఘ చర్చ అనంతరం రాజ్యసభ డోపింగ్ నిరోధక బిల్లుకు ఆమోదం తెలిపింది. కుటుంబ న్యాయస్థానాల (సవరణ) బిల్లు, 2022 కూడా ఇవాళ ఎగువ సభలో ఆమోదం పొందేందుకు చర్చించాల్సి ఉంది.
మరోవైపు లోక్ సభలో విపక్షాలు ఇవాళ కేంద్రం తీరుపై నిరసనలు చేపట్టాయి. ముఖ్యంగా ఈడీ సాయంతో విపక్షాల్ని కేంద్రం టార్గెట్ చేస్తున్న తీరుపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు ఇతర ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లి నిరసనలు తెలిపారు. అయితే కేంద్రం మాత్రం వీరిని పట్టించుకోలేదు. ఇప్పటికే ధరల పెరుగుదల, జీఎస్టీ స్లాబ్ ల పెంపు వంటి అంశాలపై విపక్షాలు నిరసనలు చేస్తూనే ఉన్నాయి. ఉభయసభల్లో 20 మందికి పైగా విపక్ష ఎంపీలు సస్పెండ్ కూడా అయ్యారు.












Click it and Unblock the Notifications