కొత్త మెట్రో రైలులో గుట్కా గబ్బు- ఏంట్రా ఈ ఛండాలం
కొత్తగా ప్రారంభానికి నోచుకున్న మెట్రో రైలు, స్టేషన్లల్లో గుట్కా మరకలు కనిపించిన ఉదంతం ఇది. బీహార్ లో చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాట్నా మెట్రో ఎలివేటెడ్ సెక్షన్‌ను ప్రారంభించిన రెండు- మూడు రోజులకే దీని పరిదిలోని స్టేషన్లల్లో ఎక్కడపడితే అక్కడ గుట్కా మరకలు కనిపించాయి. చూసే వారికి అసహ్యాన్ని కలిగించాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇటీవలే నితీష్ కుమార్ ఈ మెట్రో రైల్ ను ప్రారంభించారు. 3.45 కిలోమీటర్ల ఎలివేటెడ్ సెక్షన్ ఇది. పాట్నా బస్ టెర్మినల్, జీరో మైల్, భూత్‌నాథ్ లను కలుపుతుంది. మెయిన్ కారిడార్ లో భాగంగా ఈ నెల 6వ తేదీన ఇది అందుబాటులోకి వచ్చింది. ప్రతిరోజూ ఉదయం 8 నుండి రాత్రి 10 గంటల వరకు 20 నిమిషాల వ్యవధిలో ఈ రూట్ లో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తోన్నాయి. రోజూ వేల సంఖ్యలో ప్రయాణికులు దీన్ని వినియోగించుకుంటోన్నారు.

కొత్తగా ప్రారంభమైన ఈ మెట్రో రైలు స్టేషన్లల్లో పాన్ పరాగ్, గుట్కా మరకలు దర్శనం ఇచ్చాయి. పాట్నాకు చెందిన రౌనక్ అగర్వాల్ అనే వ్లాగర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. మెట్రో స్టేషన్‌లోని గోడలపై గుట్కా మరకలు స్పష్టంగా కనిపించడం ఈ వీడియోలో చూడొచ్చు. మెట్రో ప్రారంభమైన 2-3 రోజుల్లోనే గుట్కా గ్యాంగ్ తన పని మొదలుపెట్టిందని, స్టేషన్లు, ప్లాట్‌ఫామ్‌లను ఎర్రటి మరకలతో నింపేశారని అగర్వాల్ చెప్పాడు.
"బీహార్ ప్రజలారా, ఇది చూసి సిగ్గుపడండి. ప్రభుత్వం ఇంత మంచి పని చేసి మెట్రోను నిర్మిస్తే, మీరు దాన్ని ఇలా మురికి చేస్తున్నారు.." అని వ్యాఖ్యానించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో పౌర స్పృహపై చర్చ జరుగుతోంది. ఈ వీడియోకు 1.1 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. వందలాది కామెంట్లు పోస్ట్ అయ్యాయంటే ఇది ఏ స్థాయిలో వైరల్ అయిందో అర్థం చేసుకోవచ్చు. జనాలకు కనీస సామాజిక స్పృహ ఉండట్లేదని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చాలా మంది డిమాండ్ చేశారు.
"ఉమ్మివేయడం, పొగాకు నమలడంపై రూ. 200-300 జరిమానా విధించండి. దాన్ని సమర్థవంతంగా అమలు చేయండి. ఓ ఆదాయ వనరుగా మార్చండి.." అని ఒక యూజర్ సూచించాడు. ప్రతి మెట్రో స్టేషన్ లో సీసీ కెమెరాలు ఉంటాయని, అక్కడ ఉమ్మివేసిన వారి ఫోటోలను విడుదల చేయాలని, వారితోనే ఆ మరకలను కడిగించాలని మరో యూజర్ అభిప్రాయపడ్డారు. "చెత్త వేసిన వారిని కెమెరాల ద్వారా గుర్తించి, సిగ్గు వచ్చేంత వరకు వారితోనే కడిగించాలి. ఒక్క చెత్త ముక్క పడేస్తే, గంట పాటు వీధులను శుభ్రం చేయించాలి.." అని మరొకరు కామెంట్ చేశారు.












Click it and Unblock the Notifications