నీలిరంగు జాకెట్ ధరించిన ప్రధాని మోడీ: దాని ప్రత్యేకత ఏమిటంటే?
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం రాజ్యసభకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఆకర్షణీయమైన నీలం రంగు జాకెట్‌లో కనిపించారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం రాజ్యసభకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఆకర్షణీయమైన నీలం రంగు జాకెట్‌లో కనిపించారు. సాధారణంగా మోడీ అలాంటి వస్త్రధారణలోనే కనిపిస్తారు కానీ.. ఈ జాకెట్‌కు మాత్రం ప్రత్యేకత ఉంది. ఈ జాకెట్ ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేసి దీన్ని తయారు చేయడం గమనార్హం.
ఇక ఆ జాకెట్ వివరాల్లోకి వెళితే.. బెంగళూరు వేదికగా జరుగుతున్న 'ఇండియా ఎనర్జీ వీక్-2023' ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీ సోమవారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.. ప్రధాని మోడీకి ఈ అరుదైన బహుమతిని అందించింది. ఇదే సుమారు 28 పెట్(పాలీఇథలిన్ టెరెప్తలేట్) బాటిళ్లను రీసైకిల్ చేసి తయారు చేసిన నీలం రంగు జాకెట్.

ఈ క్రమంలోనే ప్రధాని మోడీ ఈ నీలం రంగు జాకెట్ ను ధరించి బుధవారం పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. ఈ నీలం రంగు జాకెట్ ద్వారా హరిత సందేశం ఇచ్చారు ప్రధాని. హరిత వృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మోడీ ప్రభుత్వం.. ఇటీవల రూ. 19,700 కోట్లతో నేషనల్ గ్రీన్ హైడ్రోజ్ మిషన్ ప్రారంభించింది. కర్బన ఉద్గారాలను తగ్గించి హరిత ఇంధనంతో వృద్ధి సాధించడమే దీని ప్రధాన ఉద్దేశం.
అంతేగాక, ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్‌లోనూ తమ ఏడు ప్రాధాన్యాంశాల్లో హరిత వృద్ధిని ఒకటిగా చేర్చింది మోడీ ప్రభుత్వం. ఇంధన పరివర్తన కోసం రూ. 35 వేల కోట్ల నిధులు కేటాయించింది. కాగా, వాతావరణ మార్పులపై పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ప్రధాని మోడీ కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల మహాబలిపురంలో స్వయంగా చీపురు చేతపట్టి బీచ్ ను శుభ్రం చేశారు ప్రధాని మోడీ. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications