ఈవెంట్ మేనేజర్ ఇంతకన్నా ఏం చేయగలడు: మల్టీ టాస్క్‌లో ఫెయిల్: మోడీపై రాహుల్ ఫైర్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ భయానకంగా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. కరోనా కట్టడికి సకాలంలో ఎలాంటి నిర్ణయాలను తీసుకోలేకపోయారని మండిపడ్డారు. ముందుచూపుతో వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితులు ఉండేవి కావని వ్యాఖ్యానించారు. ఈ పెను సంక్షోభ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ ఈవెంట్ మేనేజర్‌లా కనిపించారని ఎద్దేవా చేశారు.
ఒక ఈవెంట్ తరువాత.. మరో ఈవెంట్ అన్నట్టుగా ప్రవర్తించారని మండిపడ్డారు. కొద్దిసేపటి కిందటే ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడం, అదే సమయంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించే ప్రయత్నంలో మోడీ విఫలమయ్యారని విమర్శించారు. ఈ రెండు విషయాల్లో సమర్థవంతంగా పని చేయలేకపోయారని ధ్వజమెత్తారు. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తాను మాట్లాడానని, వాస్తవ పరిస్థితుల, కరోనా మరణాలు ప్రభుత్వం చెప్పే లెక్కల కంటే అధికంగా ఉన్నాయని అన్నారు.

కరోనా మరణాలపై కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి కూడా తప్పుడు లెక్కలు వస్తోన్నాయని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. సమస్య అంతా కరోనా వైరస్‌ను ఎలా ఎదుర్కొనాలనే విషయంపైనే స్థూలంగా కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అవగాహన లేదని ఆరోపించారు. వైరస్ మ్యుటేషన్‌ను అర్థం చేసుకోవడం, దాన్ని కట్టడి చేయడం, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడంపై నిశ్చేతనంగా ఉండిపోయిందని ధ్వజమెత్తారు. కరోనాను జయించామంటూ ప్రధాని మోడీ గొప్పలు చెప్పుకొన్నారని, ఆ సమయంలోనే తాము సెకెండ్ వేవ్ ఉధృతి గురించి అప్రమత్తం చేశారని అన్నారు.
మాస్కులు ధరించడం, లాక్‌డౌన్లను విధించడం కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో నివారణలో తాత్కాలికంగా మాత్రమే ఉపశమనాన్ని కలిగిస్తాయని వ్యాఖ్యానించారు. కరోనాను రూపుమాపడానికి శాశ్వత పరిష్కారం ఒక్క వ్యాక్సిన్ మాత్రమేనని తేల్చి చెప్పారు. సరిగ్గా అక్కడే కేంద్రం విఫమైందని మండిపడ్డారు. 130 కోట్లకు పైగా ఉన్న దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి ఎంతసమయం పడుతుందో కేంద్రానికి తెలుసా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications