ఫ్రాన్స్ నుంచి అదే పనిగా అమిత్ షాకు మోదీ అర్జంట్ ఫోన్ కాల్..!!
న్యూఢిల్లీ: రోజులు గడుస్తున్నప్పటికీ భారీ వర్షాలు.. ఉత్తరాది రాష్ట్రాలను వదలట్లేదు. అల్లకల్లోలానికి గురి చేస్తోన్నాయి. ఏకధాటిగా కురుస్తోన్న వర్షాలకు నదులు పోటెత్తుతున్నాయి.. ఉప్పొంగి ప్రవహిస్తోన్నాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్.. ఇలా ఉత్తరాదిలోని పలు రాష్ట్రాలు అతలాకుతలమౌతోన్నాయి. రికార్డుస్థాయి వర్షపాతం ఆయా రాష్ట్రాల్లో నమోదవుతోంది.
దేశ రాజధాని కూడా ఈ భారీ వర్షాలకు అల్లాడిపోతోంది. యమునా నది మహోగ్రరూపాన్ని దాల్చింది. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. 208. 48 మీటర్లకు చేరింది. ఇది రికార్డ్. గతంలో ఎప్పుడూ ఈ స్థాయికి చేరుకోలేదు యమునమ్మ. రాత్రికి దీని ప్రవాహం మరింత పెరగొచ్చని సెంట్రల్ వాటర్ కమిషన్ అంచనా వేసింది.

ఎగువన కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల హత్నికుండ్ బ్యారేజీ నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో యమునా నది నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. కాశ్మీరీ గేట్, సీటీఓలను తాకింది వరద నీరు. ఎర్రకోట రోడ్లనూ ముంచెత్తింది. ఢిల్లీలోని అనేక ప్రాంతాలు వరద నీటిలో మునకేశాయి. ఢిల్లీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యగా ఢిల్లీ పోలీసులు 144 సీఆర్‌పీసీని విధించారు.
ఐటీఓలోని ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ కార్యాలయంలోనికి వరద నీరు చేరిందంటే దారి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అనేక ప్రాంతాలు నీట మునగడం వల్ల ఆయా మార్గాలను అధికారులు మూసివేశారు. ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. ఫలితంగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలు పోటెత్తాయి. గంటల కొద్దీ రాకపోకలు స్తంభించిపోయాయి.
లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న మొత్తం 16,564 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది ఢిల్లీ ప్రభుత్వం. మరో 14,534 మంది నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటోన్నారు. ఢిల్లీ పరిధిలోని అన్ని పాఠశాలలు, విద్యాసంస్థలను మూసివేశారు. ఈ నెల 16వ తేదీ వరకు సెలవును ప్రకటించారు.

ఈ పరిణామాలన్నింటిపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ఆయన అత్యవసరంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. ఢిల్లీ వరద స్థితిగతులపై మాట్లాడారు. పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. వరద సహాయక చర్యల గురించి మోదీ ఆయనను అడిగి తెలుసుకున్నారు.
మరో 24 గంటల్లో యమునా నది నీటిమట్టం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఈ సందర్భంగా అమిత్ షా వివరించారు. లెప్టినెంట్ జనరల్ వీకే సక్సేనా.. ఢిల్లీ వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తోన్నారని, నిశితంగా పరిశీలిస్తోన్నారని వివరించారు. సహాయ, పునరావాస కార్యక్రమాలు ముమ్మరం సాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు సహాయం చేయడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరింపజేసినట్లు వివరించారు.












Click it and Unblock the Notifications