రిపబ్లిక్ డే.. ప్రత్యేక ఆకర్షణగా ప్రధాని మోదీ తలపాగా.. పెద్ద చరిత్రే ఉందిగా!
76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి పూరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి . దిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం ఈసారి ప్రత్యేకత. వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధరించిన తలపాగా చాలా ప్రత్యేకంగా నిలిచింది.
రిపబ్లిక్ డే వేడుకల్లో వికసిత్ భారత్, నారీ శక్తి అంశాలు ప్రధాన ఆకర్షణ
ఈ వేడుకల్లో వికసిత్ భారత్, నారీ శక్తి అంశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దేశ చరిత్రలో తొలి సారిగా 100 మంది మహిళలు శంఖం, నాదస్వరం వంటి సంప్రదాయ సంగీత వాయిద్యాలను వాయిస్తూ కర్తవ్యపథ్‌లో నిర్వహిస్తున్న పరేడ్ ను ప్రారంభించారు. ఇండోనేసియాకు చెందిన నేషనల్ ఆర్మ్ డ్ ఫోర్సెస్ నుంచి 152 మంది బృందం కవాతులో పాల్గొంది. మరో 190 మంది సభ్యుల బ్యాండ్ బృందం మార్చ్ నిర్వహించింది.

త్రివిధ దళాలు సంయుక్తంగా ప్రదర్శించిన శకటం ప్రత్యేక ఆకర్షణ
లెఫ్టినెంట్ అహాన్ కుమార్ నేతృత్వంలోని 61 మంది అశ్విక దళం కవాతు నిర్వహించింది. అనంతరం ట్యాంక్ T-90 (భీష్మ), BMP-2 శరత్‌తో పాటు నాగ్, బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థలు, పినాక, అగ్నిబాణ్ మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్లు, ఆకాశ్ వెపన్ సిస్టమ్, చేతక్, బజరంగ్, ఐరావత్‌తో సహా పలు ఆయుధాలను ప్రదర్శించారు. ఈ వేడుకల్లో త్రివిధ దళాలు సంయుక్తంగా ప్రదర్శించిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 'సశక్త్ ఔర్ సురక్షిత్ భారత్' అనే థీమ్‌తో దీన్ని తయారు చేశారు.
భారత ప్రధాని మోదీ తలపాగా చాలా స్పెషల్
ఇక భారత ప్రధాని ధరించిన తలపాగా విషయానికి వస్తే ఎరుపు, పసుపు కలగలిసిన వర్ణంతో రాజస్థాన్ సంస్కృతికి ప్రతీకగా ఆయన సఫాను ధరించారు. ప్రతి సంవత్సరము ప్రధాని మోదీ స్వాతంత్ర్య, గణతంత్ర వేడుకల సమయంలో ధరించే తల పాగాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఆయన తలపాగాలను ధరిస్తారు.
ప్రతీ సంవత్సరం ఒక ప్రాంత సంస్కృతి తెలిపేలా తలపాగా
2024 గణతంత్ర దినోత్సవ వేడుకలలో గులాబీ, తెలుపు, పసుపు, కుంకుమ వర్ణంతో కూడిన గుజరాత్ సంస్కృతికి అద్దం పట్టే తలపాగాను ధరించారు. 2023లో మహారాష్ట్రకు చెందిన ఫెటా, 2022 రిపబ్లిక్ డే వేడుకలలో ఉత్తరాఖండ్కు చెందిన టోపీ, ఇక 2021లో గుజరాత్ లోని జామ్ నగర్ సంస్కృతిని ప్రతిబింబించే హలారీ పగ్డీని ప్రధాని మోదీ ధరించారు. వివిధ ప్రాంతాల సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేయడమే కాకుండా, ప్రాంతీయ కళల నైపుణ్యాన్ని తెలియజేసేలా ప్రధాని మోదీ ధరించే తలపాగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.












Click it and Unblock the Notifications