ప్రధాని మోదీ వద్ద అదాని పేరెత్తితే..: కవిత సంచలన వ్యాఖ్యలు
పార్లమెంట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రసంగం.. దుమారం రేపుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ దీనిపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. తాజాగా బీఆర్ఎస్ వారితో గొంతు కలిపింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఘాటు విమర్శలు చేశారు.
హైదరాబాద్: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయంటూ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం ఇవ్వాళ కూడా కొనసాగింది. హిండెన్ బర్గ్ నివేదికపై దర్యాప్తు కోసం ప్రతిపక్షాలు పట్టుబట్టగా.. అధికార పార్టీ ససేమిరా అంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా.. ఈ డిమాండ్ కు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు.
ఇవ్వాళ మోదీ పార్లమెంట్ లో ప్రసంగించారు. అదానిపై ఉభయ సభలను స్తంభింపజేస్తోన్న ప్రతిపక్షాల వైఖరిని తప్పుపట్టారు. వారిపై ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం మొత్తం కుంభకోణాలమయమైందంటూ ఆరోపించారు. 2004-2014 మధ్యకాలంలో యూపీఏ హయాంలో ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి చేరుకుందని విమర్శించారు. యూపీఏ హయాంలో కుంభకోణాలు, ఉగ్రదాడులు మినహా అభివృద్ధి జరగలేదని ధ్వజమెత్తారు.

గౌతమ్ అదాని విషయంలో తాము చేసిన డిమాండ్లను ఏవీ ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడం, వాటికి సమాధానాలను ఇవ్వకుండా దాటవేయడం- అటు ప్రతిపక్ష సభ్యులను ఆగ్రహానికి గురి చేసింది. మోదీ ప్రసంగాన్ని వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మోదీ మాట్లాడుతున్న సమయంలో అదాని అంశాన్ని పదేపదే గుర్తు చేశారు. వాటినేవీ ఆయన పట్టించుకోలేదు. కాంగ్రెస్ పై ఎదురుదాడిని కొనసాగించారు.
ప్రధాని మోదీ ప్రసంగంపై భారత్ రాష్ట్ర సమితి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అదాని వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరిపించాలని, నిజాయితీని చాటుకోవాలని ప్రతిపక్షాలు సలహా ఇస్తే- వారిపై మోదీ ఎదురుదాడికి దిగడంలో అర్థం లేదని పేర్కొంది. అదాని అనే పేరు ప్రధానిని ఎందుకు ఇంతగా ఇరిటేట్ చేస్తోందని ప్రశ్నించింది. అదాని కంపెనీల షేర్లను కొనుగోలు చేసిన లక్షలాదిమంది ఇన్వెస్టర్లు తమ సంపదను కోల్పోతే- ప్రధాని మోదీ బాధ్యతారాహిత్యంగా ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడింది.
మోదీ ప్రసంగంలో ఏ మాత్రం కొత్తదనం లేదని, చెప్పిన విషయాలే మళ్లీ మళ్లీ చెబుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించారని, ప్రతిపక్షాలపై సెటైర్లు సంధించారని, ఇది ఆయన హోదాకు తగదని చెప్పారు. విపక్షాలను ఎద్దేవా చేయడం ద్వారా మోదీ తన బాధ్యతల నుంచి తప్పించుకోలేరని చెప్పారు. దేశ ప్రజలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు సరైన సమాధానం ఇస్తారని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications