మద్యం మత్తులో పోలీస్‌ను చితకబాదేశారు
బెంగళూరు: మద్యం మత్తులో ఉన్న యువకులు విధులు నిర్వహిస్తున్న పోలీస్ మీద హత్యాయత్నం చేసిన సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. తీవ్రగాయాలైన పోలీస్ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పోలీసు అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బెంగళూరు తూర్పు విభాగంలోని రామమూర్తి నగరలోని కస్తూరి నగరలో మంగళవారం అర్దరాత్రి దాటిన తరువాత ముగ్గురు యువకులు నడిరోడ్డులో కూర్చుని మద్యం సేవిస్తున్నారు.
ఆ సందర్బంలో అటువైపు వెళ్లిన ఇద్దరు గస్తీ పోలీసులు విషయం గుర్తించి అక్కడికి వెళ్లారు. అర్దరాత్రి దాటిన తరువాత నడిరోడ్డు మీద కూర్చుని మద్యం సేవించరాదని పోలీసులు బుద్ధిమాటలు చెప్పారు. అంతే మద్యం మత్తులో ఊగిపోతున్న ముగ్గురు యువకులు రెచ్చిపోయారు.

ఒక కానిస్టేబుల్ ను పట్టుకుని చితకబాదారు. తరువాత మద్యం సీసాలతో దాడి చెయ్యడంతో ఆయనకు తీవ్రగాయాలైనాయి. నిందితులు క్షణాలలో అక్కడి నుంచి తప్పించుకుని పరారైనారు. గాయాలైన కానిస్టేబుల్ హాస్మట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు బుధవారం ఉదయం ఆసుపత్రి చేరుకుని గాయాలైన పోలీసును పరామర్శించారు. కస్తూరి నగరలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications