అదృశ్యమైన ముగ్గురు యువకులు ఐఎస్‌లో చేరారా?
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో కనిపించకుండా పోయిన ముగ్గురు యువకులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ(ఐఎస్)లో చేరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముంబైలో ఇటీవల ముగ్గురు యువకులు కనిపించకుండా పోయారు. ఈ మేరకు వారి తల్లిదండ్రులు పోలీసుల వద్ద ఫిర్యాదు చేశారు.
పశ్చిమ ముంబై శివారు ప్రాంతమైన మల్వానీకి చెందిన ముగ్గురు యువకులు ఆయాజ్ సుల్తాన్(23), మోశిన్ షేక్(26), వాజిద్ షేక్(25)లు కొద్ది రోజులుగా కనిపించడం లేదు. సుల్తాన్ అక్టోబరు 30 నుంచి కనిపించకుండా పోగా.. మిగతా ఇద్దరూ డిసెంబరు 16 నుంచి కనిపించడం లేదు. సుల్తాన్ ఉద్యోగం కోసం పుణె వెళ్తున్నట్లు చెప్పాడు.

మోశిన్ స్నేహితుడి పెళ్లికి వెళ్తున్నట్లు చెప్పి డిసెంబరు 16న ఇంట్లో నుంచి వెళ్లాడు. వాజిద్ కూడా అదే రోజు ఆధార్ కార్డుపై పేరు సరిచేయిస్తానని చెప్పి వెళ్లాడు. వీరు ముగ్గురికీ ఒకరితో ఒకరికి పరిచయం ఉండి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. వీరు ఐఎస్‌లో చేరడానికి ఇళ్లు విడిచి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు.
పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. యువకుల కోసం గాలింపు చేపట్టారు. ఇటీవల జరిగిన మరో ఘటనలో పుణెకు చెందిన 16ఏళ్ల ముస్లిం యువతి ఐఎస్ పట్ల ఆకర్షితురాలైనట్లు పోలీసులు తెలిపారు. ఆమెను అదుపులోకి తీసుకున్న ఏటిఎస్ పోలీసులు, ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications