యూపీ తొలి దశ పోలింగ్ పూర్తి- సాయంత్రం 6 గంటల వరకూ 58 శాతం ఓటింగ్ నమోదు
యూపీలో తొలిదశ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల్లో భాగంగా తొలిదశలో పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లో ఉన్న 58 నియోజకవర్గాల్లో ఇవాళ ఎన్నికలు జరిగాయి. ఇందులో సాయంత్రం ఆరు గంటల సమయానికి 58 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. అప్పటికే క్యూలో ఉన్నవారికి కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నందున పోలింగ్ తుది లెక్కల్ని ఈసీ ప్రకటించాల్సి ఉంది.
తొలి దశలో 11 జిల్లాల్లోని 58 స్థానాల్లో 73 మంది మహిళలు సహా మొత్తం 623 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇవాళ జరిగిన తొలి దశ ఎన్నికల్లో సాయంత్రం 6 గంటల వరకు 58.77 శాతం ఓటింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. సాయంత్రం 5 గంటల వరకు 57.79 శాతం పోలింగ్ నమోదైంది. అయితే, తుది లెక్కింపు తర్వాత గణంకాలు ప్రకటిస్తారు. షామ్లీ జిల్లాలోని పోలింగ్ స్టేషన్లలో 61.78 శాతం, ముజఫర్ నగర్‌లో 62.14 శాతం, బాగ్‌పత్‌లో 61.35 శాతం, మీరట్‌లో 58.52 శాతం, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్‌లో 54.77 శాతం ఓటింగ్ నమోదైంది.

హోరాహోరీగా సాగుతున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల్లో జరగబోతున్నాయి. ఇందులో తొలిదశ పూర్తయింది. మరో ఆరు దశల ఎన్నికలు ఈ నెల, వచ్చే నెలలో జరగాల్సి ఉంది. ఇందులో బీజేపీ, ఎస్పీతో పాటు బీఎస్పీ, కాంగ్రెస్, ఎంఐఎం, అప్నాదళ్, ఆర్ఎల్డీ వంటి పార్టీలు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నాయి. అధికార బీజేపీ మరోసారి అధికారం నిలబెట్టుకోవడం ఖాయమని ఇప్పటికే పలు సర్వేలు కూడా అంచనా వేశాయి. అయినా అఖిలేష్ జోరుతో ఈసారి బీజేపీలో ఎక్కడో మూల అనుమానం ఉంది. దీంతో యూపీ ఎన్నికల్ని కాషాయ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.












Click it and Unblock the Notifications