#PonniyinSelvan: తమిళులు హిందువులు కారా, ఈ చర్చ తరచూ ఎందుకు జరుగుతుంటుంది?

మణిరత్నం సినిమా పొన్నియన్ సెల్వన్-1 (పీఎస్-1) విడుదలైన తర్వాత మొదలైన వివాదాల్లో ''తమిళులు హిందువులు కాదా?’’అనే చర్చ కూడా ఒకటి.
అసలు తమిళులు అంతా ఒకే మతానికి చెందినవారా? భాష ఆధారంగా ఒక్కటైన సమూహాన్ని మతం కోణంలో ఎందుకు చూస్తున్నారు.
పీఎస్-1 విడుదలైన తర్వాత సినిమా చుట్టూ చాలా చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా అప్పుడు నిజంగా ఏం జరిగింది? ఆ సినిమాలోని పాత్రలు నిజ జీవితంలో ఎలా ఉండేవారు? లాంటి చర్చలు వీటిలో ఉన్నాయి.
మరోవైపు అసలు రాజరాజ చోళ హిందువా? అనే అంశంపైనా చర్చ జరుగుతోంది. ఈ చర్చకు తెరపడక ముందే ఇప్పుడు అసలు తమిళులు హిందువులేనా అనే చర్చ ఊపందుకుంది.
- కోబ్రా రివ్యూ: ఏడు గెటప్‌లు... విక్రమ్‌లోని 'అపరిచితుడు’ ఇంకా బయటపడడం లేదా
- బ్రహ్మాస్త్ర: ఉజ్జయిని మహాకాళేశ్వర దర్శనం చేసుకోలేకపోయిన రణబీర్ కపూర్, ఆలియా భట్... ఏమిటీ వివాదం?
నేటి తమిళుల మతం
గత కొన్ని రోజులుగా ట్విటర్‌లో #TamilsAreNotHindus అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దీనితోపాటు చేస్తున్న ట్వీట్లలో చాలా మంది రాజరాజ చోళ మతం ఏమై ఉంటుంది? అని ప్రశ్న కూడా వేస్తున్నారు.
కొన్ని రాజకీయ పార్టీలు కావాలనే ఇలాంటి చర్చలకు తెరతీస్తున్నాయనే విమర్శలు కూడా వస్తున్నాయి.
2011 జనాభా లెక్కల ప్రకారం, తమిళనాడు జనాభా 7.21 కోట్లు. దీనిలో చాలా మంది తాము హిందువులమని వెల్లడించారు. మొత్తంగా ఇక్కడి జనాభాలో 87.58 శాతం మంది హిందువులు ఉన్నారు. ఆ తర్వాత 6.12 శాతం మంది క్రైస్తవులు, 5.86 శాతం మంది ముస్లింలు, 0.12 శాతం మంది జైనులు, 0.02 శాతం మంది బౌద్ధులు ఉన్నారు.
అయితే, నేడు ఆన్‌లైన్ లేదా టీవీల్లో జరుగుతున్న చర్చలు నేటి మతాల గురించి కాదు. కొన్ని శతాబ్దాల క్రితం తమిళుల మతాల గురించి వారు మాట్లాడుతున్నారు.
అసలు తమిళుల సంప్రదాయాలను ఎలా చూడాలనే అంశాలపై చర్చలు జరుగుతున్నాయి.
- RRR- ఛెల్లో షో : భారత్ నుంచి ఆస్కార్‌కు నామినేట్ అయిన ఈ సినిమా కథ ఏంటి, దీని ముందు 'RRR' ఎందుకు వెనుకబడింది?
- బాయ్‌కాట్ లైగర్: విజయ్ దేవరకొండ సినిమాకు బాయ్‌కాట్ ఎఫెక్ట్ ఏంటి... సోషల్ మీడియాలో ఎందుకీ ఆగ్రహం?

రెండు వాదనలు
ఈ చర్చపై హిందూత్వ నాయకులు వాదన ఒకలా ఉంటుంది. భాషతో సంబంధం లేకుండా, ముస్లింలు లేదా క్రైస్తవులు కాకపోతే, వారు హిందువులేనని వారు చెబుతారు.
ముఖ్యంగా ''రాజరాజ తమిళ గుర్తింపును కొందరు తమకు నచ్చినట్లుగా మార్చేస్తున్నారు. ఆయన్ను ఉద్దేశపూర్వంకగానే హిందువుగా చూపిస్తున్నారు’’అని దర్శకుడు వెట్రిమారన్ వ్యాఖ్యానించారు.
అయితే, ''అసలు రాజరాజ చోళ ఏ మసీదులు, చర్చిలు కట్టించారో కాస్త చెప్పండి’’అని హిందూత్వ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అంటే ఇక్కడ ఎవరైనా దేవాలయాలు నిర్మిస్తే, వారు హిందువులే అవుతారనేది వారి వాదన.
అయితే, ఈ వాదనకు రెండు కోణాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
వీటిలో మొదటిది: ''నిజానికి తమిళ ప్రజలు మొదట శైవ లేదా వైష్ణవ వర్గానికి చెందినవారు. ఆ తర్వాత వీరంతా కలిసి హిందువులుగా మారారు. కాబట్టి, తమిళులను శైవులు లేదా వైష్ణవులుగా పిలవాలి.’’
రెండోది: ''తమిళుల్లో సెక్యులర్ భావజాలం మెండుగా ఉంటుంది. వీరిని మతాలకు అతీతంగా చూడాలి.’’
అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో రెండో వాదనకు అంత బలంలేదనే చెప్పుకోవాలి.
మొదట్లో ప్రకృతిని ఆరాదించే తమిళులు.. క్రమంగా మతాలవైపు వచ్చారు. వైదిక ఆచారాలకు అనుగుణంగా చాలా మంది రాజులు యజ్ఞాలను కూడా నిర్వహించారు. తొలి పాండ్య రాజులను ''పాల యాగ సాలై ముదుకుడుమి పెరువఝుథి’’గా పిలిచేవారు. ఇక్కడ ''పాల యాగ సాలై’’అంటే చాలా యజ్ఞాలు నిర్వహించేవారని చరిత్రకారుడు కేఏ నీలకంఠ శాస్త్రి చెబుతారు.
- జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా రారా? వస్తే బీజేపీలో చేరతారా లేదా - అభిప్రాయం
- అప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాను అడ్డుకుంటామన్నారు, ఇప్పుడు ఎన్టీఆర్‌ను అమిత్ షా మెచ్చుకున్నారు... సోషల్ మీడియాలో ఎవరేమన్నారు?

పది భిన్నమైన మతాలు
ఇక్కడ ప్రాచీన కాలంలో జైన, బౌద్ధ సాహిత్యాలు సిలాప్పదికారం, మణిమేకలై లాంటి వాటితోపాటు తిరుక్కురళ్ లాంటి సెక్యులర్ సాహిత్యం కూడా మనకు కనిపిస్తుంది.
మణిమేకలైలో మనకు ఒక ఒక ఆసక్తికరమైన అంశం కనిపస్తుంది. ఈ కథలో హీరోయిన్ మణిమేకలై వంజి నగరంలో తొమ్మిది మతాలకు చెందిన పండితులతో మాట్లాడతారు. ఆ తొమ్మిది మతాలను వైదిక వాదం, అశైవిక వాదం, బ్రహ్మ వాదం, సంఖ్యావాదం, నికండ వాదం, భూత వాదం, వేద వాదం, వైశేదిక వాదం, శైవ వాదం.
ఇక్కడ మనం మణిమేకలై మతం బౌద్ధం కూడా కలిపితే, ఆ కాలంలో మొత్తంగా పది మతాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే, ఇక్కడ హిందు లేదా క్రైస్తవం గురించి ప్రస్తావన లేదు.
అంటే మణిమేకలై ప్రకారం, 1,500 నుంచి 2,000 ఏళ్లకు ముందు ఆనాటి దేశంలో చాలా మతాలు ఉన్నాయి.
- హిందీ సినిమాలపై విద్వేష ప్రచారాల వెనుక ఎవరున్నారు?
- రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫొటోల వివాదం మన నైతిక విలువల గందరగోళాన్ని సూచిస్తోందా?
శైవం, వైష్ణవం..
అయితే, ఎనిమిది, తొమ్మిది శతాబ్దాల్లో భక్తి ఉద్యమం మొదలైంది. క్రమంగా జైన, బౌద్ధ మతాలు వాటి ప్రాధాన్యాన్ని కోల్పోతూ వచ్చాయి. తమిళుల్లో శైవ, వైష్ణవ వర్గాలు అప్పట్లో స్థిరంగా ఉండేవి. ఎనిమిదో శతాబ్దంలోనే తమిళనాడులోకి ఇస్లాం వచ్చింది.
చోళుల సామ్రాజ్యంలో శైవ, వేదిక మతాలు మరింత పటిష్టం అయ్యాయి. విజయనగర రాజుల కాలంలో వైదిక సంప్రదాయాలైన కొన్ని యజ్ఞాలు, మంత్రాలు కూడా మళ్లీ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇవి ఇటు శైవం, అటు వైష్ణవం రెండింటిలోనూ కనిపించేవి.
ఈ క్రమాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ కాలంలోనూ ఇక్కడ ఒక మతం అనేది లేదని స్పష్టం అవుతోంది.
- మోదీ ప్రభుత్వానికి హిందూత్వం అజెండాగా మారినట్టేనా?
- బాల్ ఠాక్రే ప్రాణ భయమే శివసేనను మహారాష్ట్రకు పరిమితం చేసిందా
మతం వర్సెస్ భాష?
ఇక్కడ హిందువులు వర్సెస్ తమిళులు వివాదంలో ఒక వైరుధ్యం మనకు కనిపిస్తుంది. ఇక్కడ హిందువు అనే మతాన్ని మరో మతంతో పోల్చకుండా తమిళలు అనే భాషతో పోలుస్తున్నారు. ఇక్కడ తమిళ గుర్తింపు అనేది సెక్యులర్ భావనతో ముడిపడి ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఈ చర్చలకు చాలా సుదీర్ఘ చరిత్ర ఉందని చరిత్రకారుడు, రచయిత స్టాలిన్ రాజంగం అంటారు. ''19వ, 20వశాబ్దాల్లో తమిళనాడులో తమిళ్‌కు సెక్యులర్ గుర్తింపు ఇవ్వడం మొదలైంది. అప్పుడే ప్రచురణలతోపాటు బ్రాహ్మణేతర, ద్రావిడ ఉద్యమాలు కూడా మొదలయ్యాయి. దీంతో నిజానికి సెక్యులర్ కాని వ్యక్తులు కూడా సైంటిఫిక్ అవుట్‌లుక్ కోసం తాము కూడా సెక్యులర్ అని చెప్పుకోవడం మొదలుపెట్టారు’’అని స్టాలిన్ అన్నారు.
''20వ శతాబ్దంలో తమిళ గుర్తింపుకు సెక్యులర్ గుర్తింపు నివ్వడం మరింత ఎక్కువైంది. ఉత్తరభారత దేశం నుంచి అణచివేత ఎదురైన ప్రతిసారీ తమిళులు తమ భాషాపరమైన గుర్తింపును పైకితీసుకొచ్చేవారు కాదు. ఇది ఏదో జాతి, భాషాపరమైన గుర్తింపు కాదు. ఇది సెక్యులర్ గుర్తింపు. ఉత్తరాధి ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు ఈ సెక్యులర్ విధానాలను ముందుకు తెచ్చేవారు’’అని ఆయన వివరించారు.
- సనాతన్ సంస్థ 'హిందుత్వ తీవ్రవాద' శిక్షణ కేంద్రమా?
- హిందుత్వ రాజకీయాలకు రామాయణం టీవీ సీరియల్ ఊపిరి పోసిందా?
''1950ల్లో సెక్యులర్ గుర్తింపును ప్రజాస్వామ్యీకరించాలనే ఆలోచనలు మొదలయ్యాయి. అయితే, దీనికి కొన్ని అవరోధాలు ఉన్నాయి. ఉదాహరణకు రాజరాజ చోళ గుర్తింపును తీసుకోండి. ఆయన వైదిక సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇచ్చారని చరిత్ర చెబుతోంది. దీంతో ఎన్.వనమమాలై, ఎ. శివసుబ్రహ్మణియన్, కో కేశవన్, ఇన్కులాబ్ లాంటి రచయితలు రాజరాజ చోళ కాలాన్ని మనం విమర్శనాత్మక కోణంలో చూడాలని చెప్పడం మొదలుపెట్టారు. ఇక్కడ ఇన్కులాబ్ ఒక తమిళ జాతీయవాది. అయిన్పటికీ రాజరాజ చోళ గుర్తింపును ఆయన విమర్శనాత్మకంగా చూశారు. అలా తమిళ సెక్యులర్ గుర్తింపు మరింత బలపడింది. అందుకే అలా మతానికి వ్యతిరేకంగా తమిళ గుర్తింపును ముందుకు తీసుకురావడం ఎక్కువైంది’’అని ఆయన చెప్పారు.
తమిళ సాహిత్యం లేదా తమిళ గ్రంథాల్లో హిందూ అనే పదం మనకు ఎక్కడా కనిపించదని పరిశోధకుడు ఎస్.శివసుబ్రహ్మణియన్ చెప్పారు. పరిపతల్ పుస్తకంలో విష్ణు, మురుగన్‌ల గురించి ప్రస్తావించారు, అయితే, ఇవి నేటి హిందూ దేవతల గురించే అని అనుకోకూడదని ఆయన వివరించారు.
''బ్రిటిష్ కాలంలో ఇక్కడ హిందూ అనే పదం వాడటం మొదలైంది. అది కూడా భిన్న మతాలకు వారు ఈ పదాన్ని ఉపయోగించేవారు. ఆ తర్వాత.. భగవద్గీత, మనుస్మృతి లాంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వడం కూడా ఎక్కువైంది. ఇవి హిందూ గ్రంథాలని, హిందువులంతా వీటిని అంగీకరించాలని చెప్పేవారు’’అని శివసుబ్రహ్మణియన్ వివరించారు.
''ఇక్కడ తమిళులు హిందువులని చెప్పినప్పుడు, వారి మధ్య ఉండే భిన్న సంప్రదాయాలను వారు పూర్తిగా తొలగిస్తూ, అందరినీ ఒకే చట్రం కిందకు తీసుకురావాలని చూస్తున్నారు’’అని ఆయన అన్నారు.
''ఇక్కడ సుడలై మదన్, అన్నన్‌మార్ సామి లాంటి గ్రామీణ దేవతలను కొలవడాన్ని.. ఇతర హిందూ దేవతల పూజలతో ఎలా పోల్చగలం. వ్యవస్థీకరించిన మతాల కంటే ఇవి భిన్నమైనవి’’అని ఆయన వివరించారు.
- హిందుత్వ జెండాను మోస్తున్నవారు ఎవరు, హిందూ దేశ నిర్మాణానికి సైనికులు సిద్ధమవుతున్నారా
- గౌరీ లంకేశ్- డాభోల్కర్‌ల హత్య, నాలాసోపారా కేసుల్లో నిందితులు ఒకరికి ఒకరు ముందే తెలుసా?
చర్చలు అలానే..
''అయితే, ఇటు హిందూ, ఇటు తమిళం.. రెండు గుర్తింపులను తమకు గర్వంగా ఎవరికివారు చెప్పుకొంటున్నారు. అయితే, 40-50ఏళ్లకు ముందు పుట్టుకొచ్చిన విమర్శనాత్మక ధోరణి ఈ రెండింటింతోనూ విభేదిస్తోంది’’అని స్టాలిన్ అంటారు.
''ఒకవేళ తమిళ గుర్తింపులో అందరినీ కలుపుకోవాలని అనుకుంటే, విమర్శించే ఉద్యమాల వెనకున్న ఆలోచనలను కూడా కలుపుకోవాలి. వాటిని విడిగా చూడకూడదు’’అని ఆయన చెప్పారు.
అదే సమయంలో హిందూ గుర్తింపుకు వ్యతిరేకంగా శైవ-వైష్ణవ గుర్తింపులను తీసుకొచ్చినప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలని ఆయన అంటారు.
''హిందూ మతం అనేది భిన్న సంప్రదాయాల కలయికతో ఏర్పడిందని మనం చెబుతాం. అయితే, ఇక్కడ శైవం, వైష్ణవంలోనూ అప్పట్లో కొన్ని స్థానిక సంప్రదాయాలు కలసిపోయాయి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి’’అని ఆయన వివరించారు.
ఇక్కడ హిందూ వర్సెస్ తమిళ వివాదం ఇప్పుడు మొదలైనది కాదు. అలానే ఇప్పుడే ఇది ముగిసిపోదు.
ఇవి కూడా చదవండి:
- చైనా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది.. ఈ 'విధ్వంసానికి’ 5 కారణాలు..
- తెలంగాణ: 'చూపు పోయింది.. వరంగల్‌లో అడుక్కుని బతకమన్నారు.. 50 ఏళ్లుగా నేను ఏం చేస్తున్నానంటే..’
- జనాభా నియంత్రణ గురించి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు.. టార్గెట్ ముస్లింలు, క్రైస్తవులేనా?
- శ్రీకాకుళం జిల్లా: బట్టలు ఉతకం అన్న రజకులు.. ఇతర కులాల సహాయ నిరాకరణ.. ఏం జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మెక్సికోలో అగంతకుల కాల్పులు, మేయర్ సహా 18మంది మృతి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)