గౌతమి హత్య: నక్సల్స్ వద్ద మహేష్ శిక్షణ?
బెంగళూరు: బెంగళూరులోని కాడుగోడి సమీపంలో ఉన్న ప్రగతి కాలేజ్ అటెండర్ మహేష్ కు నక్సల్స్ తో సంబంధాలు ఉన్నాయని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు మహేష్ ప్రవర్థనతో విసిగిపోయారు. మానసిక అస్వస్థతకు గురైన వాడిలాగ నటిస్తూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు.
మహేష్ ప్రగతి కాలేజ్ లో పీయుసీ విద్యాభ్యాసం చేస్తున్న గౌతమి (18)ని పిస్తోల్ తో కాల్చి చంపిన విషయం తెలిసిందే. మహేష్ జరిపిన కాల్పులలో గాయపడిన శిరీషా మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నది. కేసు నమోదు చేసిన పోలీసులు మహేష్ ను శివమొగ్గ జిల్లాకు తీసుకు వెళ్లారు.
శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్ళి, అగుంబే, కందలబైలు తదితర ప్రాంతాలకు మహేష్ ను పిలుచుకుని వెళ్లారు. మహేష్ గత రెండు సంవత్సరాల నుండి బెంగళూరులోని ప్రగతి కాలేజ్ లో అటెండర్ గా పని చేస్తున్నాడు. ఇతను బెంగళూరు రాకముందు శివమొగ్గ జిల్లాలో నక్సల్స్ తో సంచరించాడని విచారణ చేస్తున్న పోలీసులు అంటున్నారు.

తీర్థహళ్ళి, అగుంబె పరిసర ప్రాంతాలలోని దట్టమైన అటవి ప్రాంతంలో నక్సల్స్ దగ్గర ఇతను తుపాకి ఎలా కాల్చాలి అని తెలుసుకున్నాడని దర్యాప్తులో వెలుగు చూసిందని పోలీసులు చెప్పారు. అదే విదంగా మందుగుండు (బాంబులు) ఎలా పేల్చాలి, వాటిని సురక్షితంగా ఎలా తరలించాలని మహేష్ నక్సల్స్ దగ్గర శిక్షణ తీసుకున్నాడని పోలీసులు అంటున్నారు.
అరెస్టు అయిన మహేష్ దగ్గర ఉన్న9 ఎంఎం పిస్తోల్ ను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఇది అత్యాధునికమైన పిస్తోల్ అని పోలీసు అధికారులు అంటున్నారు. మహేష్ అగుంబే ప్రాంతంలోనే పిస్తోల్ సంపాదించాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది.
విచారణ చేస్తున్న సమయంలో మహేష్ మానసిక అస్వస్థతకు గురైనవాడిలాగ నటిస్తున్నాడని, రోజుకు ఒక మాట చెబుతున్నాడని పోలీసులు అంటున్నారు. అయితే మహేష్ ఆరోగ్యంగానే ఉన్నాడని పోలీసులు చెప్పారు. బెంగళూరు రాక ముందు మహేష్ నక్సల్స్ తో సంబంధాలు పెట్టుకున్నాడని వెలుగు చూసిందని దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications