2రోజులు ఆగండి!: చానళ్ల బ్యాన్‌పై జవదేకర్ హెచ్చరిక
హైదరాబాద్: కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను హైదరాబాదులో గురువారం ఉదయం మీడియా ప్రతినిధులు కలిశారు. తెలంగాణలో నిలిపివేసిన చానళ్ల ప్రసారాలను పునరిద్దరించేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జవదేకర్ స్పందించారు.
జవదేకర్‌ను టీవీ 9, ఏబీఎన్ చానెళ్ల ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో చానెళ్ల ప్రసారాల నిలిపివేత ఇంకా కొనసాగుతుండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పరిస్థితిని గమనిస్తున్నామని, త్వరలోనే చానెళ్ల ప్రసారాలు పునరుద్ధరిస్తామని ఆయన ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు హామీ ఇచ్చారు. మీడియా ప్రజాస్వామ్యానికి ఆత్మ అని, ప్రజాస్వామ్య విజయంలో మీడియా కీలకపాత్ర పోషిస్తోందని అన్నారు.

మీడియా స్వేచ్ఛను ఎవరూ అడ్డుకోలేరన్నారు. బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పత్రికల్లో వ్యాసాలు రాసిన స్వాతంత్ర్య సమరయోధులు జైళ్లలో ఎన్నో ఏళ్లు ఇబ్బందులు పడ్డారాన్నారు. అలాగే, 1975 ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకు జర్నలిస్ట్‌లు ఎన్నో కష్టాలు అనుభవించారని, తెలంగాణ ఎమ్మెస్వోలపై ఎలాంటి చర్యలు తీసుకుంటామో తెలియాలంటే మరో రెండు రోజులు వేచి చూడాలన్నారు.

అనంతరం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధి కోసమే ప్రజలు మోడీకి ఓటేశారన్నారు. మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తోందని, 100 రోజుల మోడీ పాలనను దేశ ప్రజలు ఆదరించారన్నారు. విద్యార్థులకు మంచి అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు. ప్రల ఆకాంక్షలకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం పని చేస్తోందన్నారు.
అవినీతిరహితపాలన అందిస్తామన్న విశ్వాసం ప్రజల్లో కలిగిందని, దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారన్నారు. పర్యావరణ అనుమతులు ఇవ్వడమే గత ప్రభుత్వం మానేసిందని, కొన్ని నెలలుగా పెండింగులో ఉన్న ఫైళ్లన్నీ కొన్ని రోజుల్లోనే పూర్తి చేశామన్నారు. పర్యావరణానికి నష్టం లేకుండా అభివృద్ధి అన్నదే తమ లక్ష్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఉదయం భేటీ అయ్యారు. కాగా, మెదక్ ఉప ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్, పీయూష్ గోయల్, సదానంద గౌడలు పాల్గొననున్నారు.












Click it and Unblock the Notifications