బాబు ఉన్నారు, అవసరం లేదు: జగన్‌కు బిజెపి ఝలక్
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ షాకిచ్చింది. నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ తమ కూటమిలో ఉన్నంత వరకు తమకు ఆంధ్రప్రదేశ్‌లో మరో పార్టీ అవసరం లేదని బిజెపి సోమవారం స్పష్టం చేసింది.
బిజెపి అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ న్యూఢిల్లీలో మాట్లాడారు. తమకు వైయస్ జగన్ మద్దతు అవసరం లేదన్నారు. తమ కూటమిలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పారు. ఎన్డీయేలో చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు తమకు మరో పార్టీ అవసరం లేదని తేల్చి చెప్పారు.

కాగా, నరేంద్ర మోడీకి వ్యతిరేకమని ఏ రోజు కూడా చెప్పలేదని వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం చెప్పిన విషయం తెలిసిందే. మోడీని కలవడానికి ఢిల్లీ వచ్చిన ఆయన సోమవారం నాడు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోడీ సహాయం అవసరమని, అందుకు ఎన్డీయెకు అంశాలవారీగా మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు.
మోడీకి తమ మద్దతు అవసరం లేదని, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన స్థానాలను గెలుచుకున్నారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెసు దారుణంగా విభజించిందని, అలా జరిగిన విభజన విషయంలో కొన్ని మార్పులు అవసరమని, బడ్జెట్ ప్రతిపాదించే సమయంలో ఆ మార్పులను నరేంద్ర మోడీ చేస్తారని ఉద్దేశంతో వినతిపత్రం సమర్పించడానికి వచ్చామని ఆయన చెప్పారు.
దిగిపోయే ప్రధాని పార్లమెంటులో ఓ లేఖ చదివి వినిపించారని, అందులోని అంశాలు విభజన బిల్లులోకి రాలేదని, ప్రత్యేక హోదా అంటే ఏమిటో చెప్పలేదని ఆయన విమర్శించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని మోడీని కోరుతామని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి ఈ దేశ ప్రధాని సాయం అవసరమని, అందుకు అంశాలవారీగా ఎన్డియెకు మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి చేసుకునే ప్రయత్నంలో భాగంగానే నరేంద్ర మోడీని కలుస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications