Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం-ఏపీలో నిజమై కేంద్రంలో తప్పిన లెక్క..!
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈసారి లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలపైనా సంచలన జోస్యాలు చెప్పారు. కేంద్రంలో ఎన్డీయే తిరిగి అధికారం చేపట్టడం ఖాయమని, బీజేపీ 300 సీట్లు దాటడం ఖాయమని తేల్చేశారు. ఏపీలో వైఎస్ జగన్ భారీ తేడాతో ఓడిపోబోతున్నారని కూడా చెప్పేశారు. అయితే ఫలితాలు వెలువడిన తర్వాత ఇందులో ఏపీలో ప్రశాంత్ కిషోర్ జోస్యం నిజం కాగా.. కేంద్రంలో మాత్రం లెక్క తప్పింది. బీజేపీ కేవలం 240 సీట్లకే చతికిలపడింది. దీనిపై పీకే స్పందించారు.
తాజా ఫలితాలపై జాతీయ మీడియా ఛానల్ ఇండియా టుడేతో మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై దేశంలో జరిగే ఎన్నికల్లో సంఖ్యల అంచనా జోలికి వెళ్లబోనని పీకే తేల్చిచెప్పేశారు. ఈసారి ఎన్నికల్లో చాలా చోట్ల తన అంచనాలు తప్పాయని ఆయన అంగీకరించారు. ఈసారి ఎన్నికలపై తన అంచనాలను చెప్పానని, అవి 20 శాతం మేర తప్పాయని పీకే అంగీకరించారు. బీజేపీ 300 సీట్లు తెచ్చుకుంటుందని చెప్పానని, కానీ 240 దగ్గరే ఆగిపోయిందన్నారు.
బీజేపీపై జనంలో కొంత కోపం ఉందని తాను చెప్పానని, ఫలితాలు చూస్తే అసంతృప్తి మాత్రం ఉన్నట్లు తేలిందన్నారు.

ప్రతిపక్షాలకు మాత్రం ఈసారి ఎన్నికల్లో సానుకూల స్పందన రాలేదని పీకే విశ్లేషించారు. అందుకే తూర్పు, దక్షిణ భారతంలో వారు అనుకున్న ఫలితాలు సాధించలేకపోయారన్నారు. దీంతో గత ఎన్నికల తరహాలోనే అంకెలు సమం అయి ఎన్డీయే మూడోసారి అధికారం చేపడుతోందన్నారు. అయినా వ్యూహకర్త అయిన తాను ఈ నంబర్ గేమ్ లో తలదూర్చడం పొరబాటేనని, ఇకపై ఇలాంటి తప్పిదాలు చేయబోనని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ఈసారి లోక్ సభ ఎన్నికల ఫలితాలు మినహాయిస్తే తన లెక్క ఎక్కడా తప్పలేదన్నారు.












Click it and Unblock the Notifications