ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అనూహ్య మద్దతు లభించింది. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తాజా పరిణామం చోటు చేసుకుంది. మహిళా రిజర్వేషన్ల బిల్లును 21వ శతాబ్దపు అత్యంత ప్రముఖ నిర్ణయాల్లో ఒకటిగా భావిస్తోన్నారు మోదీ. ఇది నారీ శక్తికి అంకితం చేస్తామని, ఇదొక చారిత్రాత్మక ముందడుగు అవుతుందని స్పష్టం చేస్తోన్నారు. దేశ పురోగతిలో అనేక కీలక మైలురాళ్లను అధిగమిస్తున్న తరుణంలో మహిళా రిజర్వేషన్ బిల్లు అత్యంత అవసరమని అన్నారు.
ఈ పరిణామాల మధ్య మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. నారీ శక్తి వందన్ బిల్లును ప్రవేశపెట్టబోతోన్నందుకు ఆయనను అభినందించారు. దీన్ని అమలు చేయడానికి కేంద్రం చేస్తోన్న ప్రయత్నాలను ఆమె ప్రశంసించారు. ఈ రాజ్యాంగ సవరణ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే పరివర్తనాత్మక చర్యగా అభివర్ణించారు. చట్టసభల్లో మహిళలకు అతిగొప్ప ప్రాతినిధ్యాన్ని కల్పిస్తుందని పేర్కొన్నారు.

మొదటి మహిళా రాష్ట్రపతిగా, దేశ నిర్ణయాలపై ప్రభావం చూపేలా మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారానే నిజమైన సాధికారత వస్తుందని ప్రతిభా పాటిల్ ఎప్పటినుంచో విశ్వసిస్తూ వస్తోన్నారు. తన ఆలోచనలు, భావాలను కేంద్ర ప్రభుత్వం కార్యాచరణలోకి తీసుకొస్తోందని వ్యాఖ్యానించారు. ఈ సవరణ చట్టపరమైన నిబంధన కాదని, లింగ సమానత్వాన్ని పెంపొందించడానికి, సమ్మిళిత పాలనను ప్రోత్సహించి ప్రగతిశీల భారత్ ను నిర్మించడానికి సమాజ సామూహిక సంకల్పాన్ని ఇది చాటుతుందని వివరించారు.
పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో మహిళల ప్రాతినిధ్యం వల్ల చర్చలు విభిన్న దృక్పథాలతో సుసంపన్నమవుతాయని ప్రతిభా పాటిల్ అభిప్రాయపడ్డారు. ఇది సమతుల్యమైన, సానుభూతితో కూడిన విధాన ఫలితాలకు దారితీస్తుందని, భవిష్యత్ తరాల మహిళలు ప్రజా జీవితంలో చురుకుగా పాల్గొనేందుకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. సామాజిక, నిర్మాణాత్మక అవరోధాలను అధిగమించి, జాతీయ అభివృద్ధిలో మహిళలు చేసిన కృషిని దేశం నిరంతరం చూస్తూ వచ్చిందని మాజీ రాష్ట్రపతి గుర్తుచేశారు.
ఈ చట్టం వారి అపారమైన సామర్థ్యాన్ని గుర్తించి, పాలనలో అత్యున్నత స్థాయి నాయకత్వ మార్గాలను స్థిరీకరిస్తుందని అభిప్రాయపడ్డారు. చారిత్రక అసమానతలను తగ్గించి, న్యాయమైన, సమానత్వ సమాజాన్ని నిర్మించడంలో కీలక ముందడుగు అని పునరుద్ఘాటించారు. ఈ ప్రగతిశీల చొరవ గ్రామీణ, అణగారిన వర్గాల మహిళలతో సహా అనేకమందిలో ఆకాంక్షలను ప్రేరేపిస్తుందని ప్రతిభా పాటిల్ విశ్వాసం వ్యక్తం చేశారు.
మహిళలు నాయకత్వ పాత్రలను చేపట్టడానికి, దేశ నిర్మాణానికి సార్థకమైన కృషి చేసే దిశగా ప్రోత్సహిస్తుందని ఆమె పేర్కొన్నారు. సమ్మిళిత ప్రజాస్వామ్యం పట్ల ప్రపంచానికి ఇది స్పష్టమైన సందేశాన్ని కూడా పంపుతుందని అన్నారు. ఈ చిరకాల కలను సాకారం చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన నాయకులందరినీ ప్రతిభా పాటిల్ అభినందించారు. ఈ కీలక సంస్కరణ మరింత సమానమైన, సాధికారత కలిగిన, సమ్మిళిత భారతదేశాన్ని నెరవేర్చడంలో నిస్సందేహంగా కీలక పాత్ర పోషిస్తుందని ఆమె తన లేఖలో ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications