గ్యాస్ సిలిండర్లపై నామమాత్రపు ఊరట
Commercial LPG Cylinder Price: వంటగ్యాస్ వినియోగదారులకు స్వల్పంగా ఊరట లభించింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలు నామమాత్రంగా తగ్గాయి. ఒక్కో సిలిండర్‌పై రూ.14.50 పైసలు తగ్గింది. ఈ ధరలు ఈ తెల్లవారు జాము నుంచే అమలులోకి వచ్చాయి.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే చమురు కంపెనీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. డిసెంబర్ 1వ తేదీ వరకూ కూడా కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ల రేట్లు వరుసగా పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. అయిదుసార్లు పెరిగిన తరువాత తొలిసారిగా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

ఆగస్టు నుంచి డిసెంబర్ వరకూ ప్రతినెలా ఒకటో తేదీన వీటి రేట్లు పెరుగుతూ వచ్చాయి. వాటని సవరిస్తూ ఉత్తర్వులను జారీ చేస్తూ వస్తోన్నాయి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. ఈ అయిదు నెలల వ్యవధిలో అదనంగా రూ. 172.50 పైసలను అదనంగా చెల్లించాల్సి వచ్చింది వినియోగదారులకు.
ఆగస్టులో ఒక్కో సిలిండర్ మీద రూ.8.50 పైసలు, సెప్టెంబర్ 1వ తేదీన 39 రూపాయలు, అక్టోబర్‌లో 48.50 పైసలు, నవంబర్‌లో ఏకంగా 62 రూపాయల మేర భారాన్ని వినియోగదారుల మీద మోపాయి. ఇప్పుడు మళ్లీ రూ.16.50 పైసల చొప్పున పెంచాయి. ఇప్పుడు మాత్రం రూ. 14.50 పైసల మేర తగ్గించాయి.
తాజా నిర్ణయంతో దేశ రాజధానిలో ఒక్కో వాణిజ్య సిలిండర్ రేటు రూ.1,804 పైసలకు తగ్గింది. నిన్నటి వరకు ఈ ధర రూ.1,818.50 పైసలుగా ఉండేది. కోల్‌కతలో 1,927 రూపాయల నుంచి రూ. 1,911.50 పైసలకు తగ్గింది. ముంబైలో రూ. 1,771 నుంచి 1,756 రూపాయలు, చెన్నైలో 1,980 రూపాయల నుంచి 1,966.50 పైసలకు తగ్గింది.
గృహావసరాల కోసం వినియోగించే వంటగ్యాస్ కనెక్షన్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. వాటి రేట్లు యధాతథంగా కొనసాగుతున్నాయి. ఒక్కో సిలిండర్ ధర 803 రూపాయలు. ఇదివరకు కేంద్ర ప్రభుత్వం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు పంపిణీ చేసే గృహావసర వంటగ్యాస్ కనెక్షన్ల ధరలో సబ్సిడీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక్కో గ్యాస్ కనెక్షన్‌పై 200 రూపాయల సబ్సిడీని ఇచ్చింది.












Click it and Unblock the Notifications