పుల్వామా ఎఫెక్టేనా: జైపూర్ జైలులో పాకిస్తాన్ వ్యక్తి హత్య...ఇంతకీ ఎవరు చంపారు..?
జైపూర్ : ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడి తర్వాత రాజస్థాన్‌లోని జైపూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ ఖైదీని తోటి ఖైదీలు కొట్టి చంపారు. ముగ్గురు ఖైదీలు ఇతన్ని హత్యచేశారని పోలీస్ అధికారులు వెల్లడించారు. మృతి చెందిన పాకిస్తానీ ఖైదీని షకీరుల్లాగా గుర్తించారు. అతను గూఢచర్యం కేసు కింద జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
పాక్ ఖైదీ షకీరుల్లాను తోటి ఖైదీలు హత్య చేశారని ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జైళ్ల శాఖ ఇంఛార్జి అధికారికంగా ధృవీకరించారు. పుల్వామాలో జరిగిన పాక్ ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందిన నేపథ్యంలో జైపూర్ జైలులో పాక్ ఖైదీ హత్యకు గురికావడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

ఇదిలా ఉంటే పుల్వామాలో జరిగిన దాడిలో పాకిస్తాన్ ఆర్మీ, ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్, పాక్ గూఢచార సంస్థల హస్తం ఉందని భారత భద్రతా బలగాలు చెబుతున్నాయి. అయితే వీరి కనుసన్నల్లోనే జైషే ఉగ్రవాద సంస్థ బాంబు దాడికి పాల్పడిందని భద్రతా దళాలు పేర్కొన్నాయి. అయితే పాకిస్తాన్ మాత్రం భారత్ అసత్యాలు ప్రచారం చేస్తోందని ఉగ్రదాడికి పాకిస్తాన్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆదేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తెలిపారు.
మరోవైపు భారత ఆర్మీకి అన్ని అధికారాలు ఇచ్చామని సరైన సమయంలో పాక్‌పై ప్రతీకారం తీర్చుకుంటుందని మోడీ చెప్పారు. ప్రతీకారానికి భారత్ దిగితే తాము కూడా సమాధానం ఇస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. అసలు పాక్ ఈ దాడులు చేసిందనేందుకు రుజువులు చూపాలని... అలా సాక్ష్యాలు ఉంటే పాకిస్తాన్ ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుందని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications