సారీ భారత్ మాతా... టీనేజ్ యువతి ఆత్మహత్య... ఆ ముగ్గురే కారణం...
మహారాష్ట్రలోని పందర్‌పూర్ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. భారత సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని కలలు కన్న ఓ టీనేజ్ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కొంతకాలంగా ముగ్గురు వ్యక్తులు తనను తరుచూ వేధింపులకు గురిచేస్తున్న కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొంది. అదే నోట్‌లో 'సారీ భారత్ మాతా..' అని ఆ యువతి పేర్కొనడం గమనార్హం. ఆ సూసైడ్ నోట్ స్థానికులను కంటతడి పెట్టించింది.

డిసెంబర్ 7న ఆత్మహత్య
పోలీసుల కథనం ప్రకారం పందర్‌పూర్ పట్టణానికి చెందిన ఓ టీనేజ్ యువతి(17) డిసెంబర్ 7న ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని బలన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆత్మహత్య చేసుకున్న తీరును పరిశీలించారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న గదిలో సూసైడ్ నోట్ లభించింది. స్థానికంగా ఉండే ముగ్గురు వ్యక్తులు తనను నిత్యం వేధింపులకు గురిచేస్తుండటం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో పేర్కొంది.

సారీ భారత్ మాతా....
సూసైడ్ నోట్‌లో ఆ యువతి సారీ భారత్ మాతా అని పేర్కొనడం గమనార్హం.అలాగే తన తల్లిదండ్రులకు కూడా క్షమాపణలు చెప్పింది. ఆర్మీ యూనిఫామ్,త్రివర్ణ పతాక బ్యాడ్జి ధరించాలన్న తన కోరిక నెరవేరకుండానే చనిపోతున్నానని పేర్కొంది. తనకు ఎదురవుతున్న వేధింపులే అందుకు కారణమని పేర్కొన్న ఆ టీనేజర్.. వారి పేర్లను కూడా అందులో రాసింది. నిజానికి ఈ సూసైడ్ నోట్ రాసిన మూడు రోజులకు ఆమె ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.
Recommended Video

ముగ్గురి అరెస్ట్...
ఆ యువతి నోట్ బుక్స్‌లో పోలీసులు సూసైడ్ నోట్‌ను గుర్తించారు. వేధింపుల విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని ఆ ముగ్గురు తనను బెదిరించిన విషయాన్ని కూడా అందులో పేర్కొంది. ఆ నోట్ ఆధారంగా పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురు తరుచూ ఆమెపై కామెంట్స్ చేసేవారని... దాంతో ఆ యువతి తీవ్రంగా నొచ్చుకుందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని స్థానిక ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ భస్మే తెలిపారు.












Click it and Unblock the Notifications