పెళ్లికి సిద్ధమైన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..!
మహారాష్ట్రలోని పుణెలో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఒకరినొకరు ఇష్టపడ్డారు. అంతటితో ఆగకుండా పెళ్లితో ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఈ నెల 30న పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ వివాహం కోసం ఉన్నతాధికారులను సెలవు కోరుతూ అప్లికేషన్ పెట్టుకున్నారు.
ఈ షాకింగ్ ఘటన పింప్రి- చించ్ వాడ్ పోలీసు కమిషనరేట్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈ కమిషనరేట్ పరిధిలోనే పని చేస్తున్నారు. తాజాగా ఉన్నతాధికారులకు ఇచ్చిన సెలవు దరఖాస్తుతోపాటు ముద్రించిన వివాహ ఆహ్వాన పత్రికను కూడా జతచేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఓ కానిస్టేబుల్ కుటుంబం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించినట్లు సమాచారం అందుతోంది.
ఈ పెళ్లిని అడ్డుకోవాలని ఆ కానిస్టేబుల్ కుటుంబం కోరగా.. వాళ్లు మేజర్లు కాబట్టి చట్టపరంగా అడ్డుకోలేమని ఓ అధికారి స్పష్టం చేసినట్లు సమాచారం. మరోవైపు భారత్ లో స్వలింగ సంపర్కం నేరం కాకపోయినా వీరి పెళ్లికి చట్టబద్ధతమైన గుర్తింపు లభించదని తెలుస్తోంది. అందుకే వీరిలో ఒకరు ప్రస్తుత లింగమార్పిడి చికిత్స పొందుతున్నారని సమాచారం. ఇక ఈ ప్రక్రియ పూర్తయ్యాక చట్టబద్ధంగా తమ పెళ్లిని నమోదు చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు ఆగస్టు 30న పుణెలోని ఆళందిలో ఈ ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటన చేశారు. ఈ వార్త స్థానికంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

పింప్రి-చించ్ వాడ్ పోలీసు కమిషనరేట్ పరిధిలో లింగమార్పిడికి సంబంధించిన మరో వ్యవహారం కూడా ఇటీవల బయటకు వచ్చింది. బీడ్ నుంచి ఓ పోలీసు ఉద్యోగిని కమిషనరేట్ కు బదిలీ చేశారు. అనంతరం ప్రభుత్వ అనుమతులతో లింగమార్పిడి సర్జరీ చేయించుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత సర్వీస్ రికార్డుల్లో జెండర్ ను మార్చాలని ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన అప్లికేషన్ పరిశీలనలో ఉంది. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల వివాహ వేడుక, మరో పోలీసు ఉద్యోగి జెండర్ మార్పు దరఖాస్తు నేపథ్యంలో పింప్రి- చించ్ వాడ్ పోలీసు కమిషనరేట్ పరిధిలో వ్యక్తిగత సంబంధాలు, జెండర్ ఐడెంటిటీ, సర్వీస్ రికార్డుల మార్పు, స్వలింగ వివాహాల చట్టబద్ధత వంటి అంశాలపై చర్చకు దారితీశాయి.












Click it and Unblock the Notifications